
23న తెరపైకి నరివేట్టై
తమిళసినిమా: మలయాళ నటుడు టోవినో థామస్ మాలీవుడ్‌లో స్టార్ హీరో. ఈయనకు కోలీవుడ్‌లోనూ మంచి పేరు ఉంది. కాగా తాజాగా టొవినో థామన్ కథానాయకుడిగా నటించిన ద్విభాషా (తమిళం, మలయాళం) చిత్రం నరివేట్టై. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాహితీ అకాడమి అవార్డు గ్రహీత అబిన్ జోసఫ్ కథ, కథనం, మాటలు అందించిన ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా కంపెనీ పతాకంపై దీపుషా, షియాజ్‌హాసన్ నిర్మించారు. ఇందులో నటుడు టోవినో థామస్‌తోపాటు సురాజ్ వెంజరాముడు, దర్శకుడు చేరన్, ప్రియంవద కృష్ణన్, ఆర్య సలీమ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు చేరన్ ఈ చిత్రం ద్వారా మాలీవుడ్‌లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారన్నది గమనార్హం. ఇది యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కథ, కథనాలు ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తాయన్నారు. దీంతో నరివేట్టై చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్ టెయిన్‌మెంట్ సంస్థ, ఫ్యూచర్ రన్ అఫ్ ఫిలింస్ సంస్థలు తమిళనాడులో విడుదల చేయనున్నాయి. ఈ సంస్థలు చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయ నున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.