
వ్యర్థ జలాల శుద్ధీకరణకు కొత్త సాంకేతికత
– ఐఐటీ మద్రాసు ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : వస్త్ర పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి ఐఐటీ మద్రాసు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. తమిళనాడులోని తిరుపూర్‌లో ఏర్పాటు చేసిన పైలట్ ప్లాంట్‌లో దీనిని ఆవిష్కరించారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ల సాంకేతిక–ఆర్థిక సాధ్యతను తద్వారా మెరుగు పరిచారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాల కారణంగా మనుషులు, జలచరాలు, ఇతర జీవరాశులకు ప్రమాదాలు కలుగకుండా ఈ ప్రాజెక్ట్ ఒక వినూత్నంగా తీర్చిదిద్దారు. ఎలక్ట్రోకెమికల్ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేయడం ద్వారా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ల సాంకేతిక–ఆర్థిక సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు. పర్యావరణ ప్రభావాలను తగ్గించడానికి చర్యలు చేపట్టారు. ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ ఇందుమతి ఎం.నంబి నేతృత్వంలో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని కున్నకల్‌పాళయం సీఈటీపీలో అమలు చేశారు.
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
అన్నానగర్: విచిత్ర హెయిర్ స్టైల్ పెట్టుకోవడానికి తల్లిదండ్రులు నిరాకరించారని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లాలోని ఇడైపాడి సమీపంలోని చానరపట్టి గ్రామానికి చెందిన లారీడ్రైవర్ గోపాల్, కోకిల దంపతుల చిన్న కుమారుడు కీర్తిశర్మ (15), చానరపట్టి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాశాడు. ఈ స్థితిలో కీర్తి శర్మ విచిత్ర హెయిర్ స్టైల్ చేసుకోవటానికి తన తల్లిదండ్రుల అనుమతి కోరాడు. వారు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తిశర్మ శుక్రవారం తన ఇంటి నుంచి బయటకు వెళ్లి సమీపంలోని తోటలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కొంగణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.