
92 ఏళ్ల డాక్టరుకు అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: చైన్నెకు చెందిన 92 సంవత్సరాల వైద్యుడికి కంబైన్డ్ బీటింగ్ హార్ట్ ఫోర్ వెసెల్ బైపాస్, పేస్ మేకర్‌ఇంప్లాంటేషన్‌ను సిమ్స్ వైద్యులు విజయవంతం చేశారు. గురువారం ఆస్పత్రి ఆవరణలో ఈ శస్త్ర చికిత్స గురించిన వివరాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ అండ్ అడ్వాన్స్డ్ అయోర్టిక్ డిసీజ్ విభాగం డైరెక్టర్ డాక్టర్ వీవీ భాషి ప్రకటించారు. చైన్నెకు చెందిన శ్రీవల్సన్ గైనాకాలిజిస్టు సీనియర్ వైద్యులు అని వివరించారు. 92సంవత్సరాల వయస్సు కలిగిన ఆయన ఇటీవల ఛాతిలో తీవ్ర నొప్పి రావడంతో సిమ్స్‌లో చేరారు. ఇక్కడ పరీక్షలునిర్వహించిన డాక్టర్ భాషి నేతృత్వంలో వైద్యుల బృందం అన్ని రకాల పరిశోధనలతో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. 92 సంవత్సరాల వయస్సు కలిగిన ఆయనకు ఒకే ప్రక్రియలో బీటింగ్ హార్ట్ ఫోర్ వెసెల్ బైపాస్ సర్జరీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు శ్రీవల్సన్ కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసి మూడు రోజులు ఐసీయూలో ఉంచారు. ఏడు రోజులలో ఆయన డిశ్చార్జ్ కావడమే కాదు, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండడం గమనార్హం. ఈ వయస్సులో తనకు జరిగిన ఈ శస్త్ర చికిత్స గురించి శ్రీవల్సన్ మాట్లాడుతూ, తన లాంటి వృద్ధులకు ఇలాంటి సమస్యలు ఎదురైన పక్షంలో శస్త్ర చికిత్సలను ధైర్యంగా చేయించుకోవచ్చు అన్న అవగాహన కల్పించేందుకు తాను మీడియా ముందుకు వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ మహ్మద్ ఇధ్రీస్, సిమ్స్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజు శివస్వామి పాల్గొన్నారు.