
సింధూర్ యాత్రకు శ్రీకారం
●చైన్నెలో విజయోత్సవ హోమం
సాక్షి, చైన్నె: పాక్ ఉగ్ర మూకలను ఏరి పారేసేందుకు సాగిన ఆపరేషన్ సింధూర్‌లో భారత ఆర్మీ ప్రదర్శించిన అత్యుత్తమ సాహసాన్ని విజయోత్సవంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ చైన్నెలో బుధవారం సింధూర్ యాత్రను బీజేపీ వర్గాలు నిర్వహించాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో–ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, నేతలు తమిళిసై సౌందరరాజన్ ఉదయం వెస్ట్ మాంబలంలోని అయోధ్య అశ్వ మేధ మహా మండపంలోని శ్రీరామ సమాజంలో జరిగిన హోమంలో పాల్గొన్నారు. చైతన్యవంతమైన, దార్శనిక నాయకత్వం, భారత సాయుధ దళాల శ్రేయస్సు కోసం, నిరంతర విజయం కోసం, దేశ ఐక్యతను కాంక్షిస్తూ ఈ హోమం జరిగింది. సాయంత్రం చైన్నెలో జాతీయ జెండాలను చేతబట్టి ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ యాత్ర నిర్వహించారు. జాతీయ జెండా రెపరెపలాడే విధంగా, భారత ఆర్మీ సేనల శౌర్యాన్ని చాటే విధంగా ఈ యాత్ర జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ వర్గాలు ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. గురువారం ఇతర నగరాలలో, 16, 17 తేదీలలో జిల్లా కేంద్రాలలో, 18 నుంచి 23వ తేదీ వరకు గ్రామగ్రామాన జాతీయ జెండా రెప రెపలాడే విధంగా, త్రివర్ణ దళాలకు మద్దతుగా నిలిచే రీతిలో సింధూర్ యాత్ర నిర్వహించనున్నారు.