నిందితులకు శిక్ష తప్పదు | - | Sakshi
Sakshi News home page

నిందితులకు శిక్ష తప్పదు

May 15 2025 2:04 AM | Updated on May 15 2025 2:04 AM

నింది

నిందితులకు శిక్ష తప్పదు

సాక్షి, చైన్నె: దివంగత సీఎం జే జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో గతంలో జరిగిన హత్య, దోపిడీ కేసు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఎవరెవరు నిందితులుగా ఉన్నారో వారందరికి పొల్లాచ్చి కేసు తరహాలో శిక్ష తప్పదన్నారు.

సీఎం ఎంకే స్టాలిన్‌ నీలగిరి జిల్లా ఊటీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఊటీలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.143.69 కోట్లతో 700 పడకలతో బ్రహ్మాండ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఎనిమిది టవర్లతో కూడిన భవనాలు ఇందులో ఉన్నాయి. అవుట్‌ పేషెంట్‌ వైద్యసేవల కోసం ప్రత్యేక బ్లాక్‌ను, అత్యాధునిక వసతులతో పది ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాట్లు చేశారు. రక్తహీనత, సికిల్‌ సెల్‌ అనీమియా, తలసేమియా వంటి చికిత్సలకు ప్రత్యేక బ్లాక్‌లను కేటాయించారు. 20 పడకలతో 24 గంటల సేవతో అత్యవసర చికిత్సా విభాగాన్ని ఎమర్జెన్సీ బ్లాక్‌గా రూపొందించారు. బ్లడ్‌ బ్యాంక్‌, రోగులకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక వంట గది, ఆటోమెటిక్‌ వాషింగ్‌ మెషిన్లు, ప్రత్యేక బ్లాక్‌లో మార్చురీని ఏర్పాటు చేశారు. నీలగిరి జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా రూపుదిద్దుకుని సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రిని బుధవారం సీఎం ఎంకే స్టాలిన్‌ స్వయంగా సందర్శించారు. ఇక్కడి వైద్య చికిత్సలు, సౌకర్యాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడారు. రోగులను ప్రతి వార్డుకు వెళ్లి పరామర్శించి అక్కడి సేవలు, అక్కడ అందిస్తున్న సహకారం, సిబ్బంది పని తీరు గురించి ఆరా తీశారు. చికిత్స కోసం వచ్చిన వారంతా సేవలు, అత్యాధునిక వసతులు ప్రయోజకరంగా ఉన్నట్టు సీఎంకు వివరించారు.

అవగాహన కల్పనకు ఆదేశాలు

ఈ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, ప్రాజెక్టులు, అమల్లో ఉన్న వైద్య పథకాలను, సేవ్‌ మోర్‌ లైవ్స్‌ 48 పథకంతో పాటు వివిధ వైద్య అంశాల గురించి అటవీ గ్రామాలు, కుగ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలని, వారికి అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యసిబ్బంది హాజరు రికార్డుల, మందుల వివరాలకు సంబంధించిన రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం నీలగిరి ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం సందర్శించారు. వైద్యకళాశాల విద్యార్థులతో మాట్లాడారు. సేవా స్ఫూర్తితో వైద్యవృత్తిలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. వైద్యకళాశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడుతూ నీలగిరి ఆస్పత్రి సేవలను తెలుసుకునేందుకు స్వయంగా తాను వచ్చినట్టు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆస్పత్రికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తున్నట్టు వివరించారు. రోజుకు 1,300 మంది ఔట్‌ పేషెంట్లు చికిత్సకు వస్తున్నట్టు, ఇన్‌పేషంట్‌ విభాగంలో మరింత మెరుగుగా వైద్యసేవలు అందుతున్నట్టు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రికు దీటుగా ఇక్కడ సేవలు అందుతున్నాయని, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, స్కాన్లు ఉచితంగా తీయడం జరుగుతుందన్నారు. రోగులు, విద్యార్థులు అందించిన సమాచారం, వివరాల మేరకు ఇక్కడ ఎలాంటి లోపాలు అన్నది లేదన్నది స్పష్టమైందన్నారు. అధికారుల సూచన మేరకు, అవసరమైన విధంగా అదనపు సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. ముందుగా ఊటీలో సీఎం స్టాలిన్‌ వాకింగ్‌ చేశారు. ఈసందర్భంగా ఫుట్‌బాల్‌ ఆడుతున్న పిల్లలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈసమయంలో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో తాను పొల్లాచ్చి లైంగిక వేధింపు కేసు గురించి ప్రస్తావిస్తూ, ఈ కేసులో ఏఒక్క నిందితుడు తప్పించుకోలేడని, తాము అఽధికారంలోకి రాగానే శిక్షపడుతుందని స్పష్టం చేశామన్నారు. ఇది తాజాగా కార్యరూపం దాల్చిందన్నారు. దివంగత సీఎం జే జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్‌లో గతంలో జరిగిన హత్య, దోపిడీ ఘటన గురించి స్పందిస్తూ, ఈ కేసులోనూ ఏ ఒక్కరూ తప్పించు కోలేరన్నారు. నిందితులు శిక్షించబడతారని స్పష్టం చేశారు. ఎంపీ ఏ.రాజా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ రామచంద్రన్‌, నీలగిరి జిల్లా కలెక్టర్‌ లక్ష్మీ భవ్య తాండూరి, నీలగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.గీతాంజలి, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జయలలిత పాల్గొన్నారు.

ఆస్పత్రిలో రోగిని

పరామర్శిస్తున్న సీఎం స్టాలిన్‌

ఆస్పత్రి రికార్డులను పరిశీలిస్తున్న స్టాలిన్‌

న్యూస్‌రీల్‌

నేడు పుష్ప ప్రదర్శన

ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో 127వ పుష్ప ప్రదర్శన గురువారం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఉద్యానవన విభాగం సర్వం సిద్ధం చేసింది. వేసవి ఉత్సవాల్లో భాగంగా ఊటీలో ప్రతి సంవత్సరం ఈ పుష్పప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈప్రదర్శనను సీఎం ఎంకే స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఈసారి పుష్ప ప్రదర్శనతో పాటు బొటానికల్‌ గార్డెన్‌లో మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం ఏర్పాట్లు చేశారు.

పొల్లాచ్చి కేసు తరహాలో కొడనాడు కేసు నిందితులకు శిక్షలు

సీఎం స్టాలిన్‌

నీలగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అధ్యయనం

నిందితులకు శిక్ష తప్పదు1
1/3

నిందితులకు శిక్ష తప్పదు

నిందితులకు శిక్ష తప్పదు2
2/3

నిందితులకు శిక్ష తప్పదు

నిందితులకు శిక్ష తప్పదు3
3/3

నిందితులకు శిక్ష తప్పదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement