
ఘనంగా పొర్‌కోడియమ్మన్ జాతర
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని వేలంగాడు పొర్‌కోడియమ్మన్ ఆలయ చెరువు జాతర బుధవారం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం చిత్ర మాసంలో చెరువులో 10 గ్రామ పంచాయతీలు కలిసి పొర్‌కోడిఅమ్మన్ జాతర నిర్వహించడం ఆనవాయితీ. అందులోభాగంగా మంగళవారం రాత్రి అమ్మన్‌ను అలంకరించిన రథంలో ఆశీనులు చేసి వెల్లండ్రం గ్రామం నుంచి ఊరేగింపుగా చెరువులోకి తీసుకొచ్చి ఆలయంలో ఉంచారు. అనంతరం ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు మేళతాళాల నడుమ అమ్మవారి రథాన్ని భక్తి శ్రద్ధలతో చెరువులోకి తీసుకొచ్చారు. ఈరథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథంపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా వేలూరు జిల్లా నుంచి కొంత మంది భక్తులు పారంపర్యంగా ఎడ్లబండ్లపై వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కుటుంబ సమేతంగా భక్తులకు ఆహారం, మజ్జిగ అందజేశారు. దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ అనిత, ఎగ్జిక్యూటివ్ అఽధికారి అన్నామలై, సేన్‌బాక్కం అసిస్టెంట్ కమిషనర్ శంకర్, కార్యాలయ అకౌంటెంట్ ఆర్ముగం, సభ్యులు, తహసీల్దార్ వేండా పాల్గొన్నారు.