
పాన్ ఇండియా స్టార్‌గా రెజీనా
తమిళసినిమా: కళలకు హద్దులు ఉండవు. కళాకారులకు భాష ఆటంకం రాదు. అలా ఇప్పుడు దక్షిణాది తారలు బాలీవుడ్‌లోనూ, ఉత్తరాది తారలు దక్షిణాదిలోనూ ఏలుతున్నారు. ఇప్పుడు ఈ కోవలో నటి రెజీనా కసాండ్ర చేరారు. కండనాళ్ మొదల్ చిత్రం ద్వారా కొలీవుడ్‌కు పరిచయమైన నటి రెజీనా కసాండ్ర. ఆ తరువాత అళగీయ అసురా చిత్రంతో కథానాయకిగా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. అలా కేడీ బిల్లా కిలాడి రంగా, నిర్ణయం, రాజతందిరం, మానగరం, శరవణన్ ఇరుక్క భయమేన్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. కన్నడంలోనూ పలు చిత్రాలు చేసిన రెజీనా కొన్ని వెబ్ సీరీస్‌లోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎలాంటి పాత్రనైనా చేసి సత్తా చాటగలనని ఇటీవల అజిత్ హీరోగా నటించిన విడాముయర్చి చిత్రంలో ప్రతినాయకిగా నటించారు. ఇటీవల ఈ బ్యూటీ హిందీలోనూ నటించడం ప్రారంభించారు. అలా హిందీలో సన్నిలియోన్‌తో కలిసి జాత్, అక్షయ్‌కుమార్, అనన్య పాండే జంటగా నటించిన కేసరి–2 చిత్రంలో ముఖ్యపాత్రను పోషించి ఆ చిత్రాల విజయంలో పాలుపంచుకున్నారు. దీంతో పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన రెజీనా ప్రస్తుతం సుందర్.సీ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న మూక్తుత్తి అమ్మన్–2 చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు.