
● మహిళాభ్యున్నతే లక్ష్యంగా పథకాలు ● డిప్యూటీ సీఎం ఉదయని
సాక్షి, చైన్నె : ఎన్నికల వాగ్దానాలన్నీ అమలు చేస్తూ వస్తున్న సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం చైన్నె, శివారులో 1.38 లక్షల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తెలిపారు. చైన్నెలోని తిరువొత్తియూరులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో 1,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను మంగళవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ గత సంవత్సరం ఫెంగల్ తుపాన్ సమయంలో ఈ పరిసరాల్లో ప్రజలు తీవ్ర కష్టాలకు గురైనట్టు గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పరిస్థితులు త్వరితగతిన కుదుట పడ్డాయన్నారు. తాము చెప్పేది చేస్తామని, చేసేది చెబుతామని వ్యాఖ్యానించారు. అంతేకాదు, చెప్పనివి కూడా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. చైన్నెలో చాలా సంవత్సరాలుగా ఇళ్ల పట్టాలు లేకుండా సతమతం అవుతున్న వారిని గుర్తించి, ఇళ్ల పట్టాల మంజూరుకు సీఎం ఆదేశించారని గుర్తు చేస్తూ, మాధవరంలో ఇటీవల కాలంలో 2,200 మందికి, షోలింగనల్లూరులో 2 వేల మందికి, తిరువొత్తియూరులో 2,120 మందికి ఇలా ఇప్పటివరకు ఒక లక్షా 38 వేల మందికి ఇళ్ల పట్టాలను అందజేశామన్నారు. తమిళనాడులో ఆహార కొరత అన్నది లేదని, ఆమేరకు ఇక్కడ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ వస్తున్నట్టు తెలిపారు. పేదలకు సొంతంటి కలను సైతం ప్రభుత్వం సాకారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. చైన్నెలోనే కాదు, తమిళనాడు అంతటా ఎవరూ నిరాశ్రయులు లేరని వ్యాఖ్యలు చేశారు. అందరికీ ఇల్లు ఎంత ముఖ్యమో.. ఇంటి పేరు కూడా ముఖ్యమైనదని, ఇంటి పట్టా చట్టపరమైన హక్కుగా వ్యాఖ్యలు చేశారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వం మహిళాభ్యున్నతిని కాంక్షిస్తూ పథకాలను అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఒక కోటి 15 లక్షల మంది నెలకు రూ.వెయ్యి అందజేస్తున్నామని తెలిపారు. జూన్‌లో మరింత మంది అర్హులైన వారిని ఈ పథకానికి ఎంపిక చేయనున్నామన్నారు. దరఖాస్తులను అర్హులైనవారు సమర్పించాలని సూచించారు. రూ 6 వేల కోట్లతో ఉత్తర చైన్నె అభివృద్ధి జరుగుతున్నట్టు తెలిపారు. త్వరలో ఉత్తర చైన్నె మరింత సుందరంగా కనిపించబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, పీకే శేఖర్‌బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ, ఎంపీ కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యేలు ఎస్ సుదర్శనం, తాయగం కవి, ఆర్‌డీ శేఖర్, ఎలిలన్, ఐడ్రీమ్ ఆర్ మూర్తి, ఎబినేజర్, ఎంవీ ప్రభాకర్ రాజా, కేపీ శంకర్, జోసెఫ్ శామ్యూల్, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్, అదనపు ముఖ్య కార్యదర్శి పి.అముదా.ఐ.ఎ.పి., గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, చైన్నె జిల్లా కలెక్టర్ రష్మి సిద్ధార్థ్ జగడే తదితరులు పాల్గొన్నారు.