
రాఘవ లారెన్స్ హీరోగా బెంజ్
తమిళసినిమా: నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బెంజ్. ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, జి స్క్వాడ్ సంస్థ అధినేత దర్శకుడు లోకేష్ కనకరాజ్ , ది రూట్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత జగదీష్ పళనిస్వామి కలిసి నిర్మిస్తున్న కమర్షియల్ అంచనాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రం ఇది. ఇంతకుముందు రెమో, సుల్తాన్ తదితర సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన భాగ్యరాజ్ కన్నన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న తాజా చిత్రం బెంజ్.ఈ చిత్రం షూటింగ్ సోమవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు అనంతరం చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇందులో నటి సంయుక్త నాయకిగా నటిస్తున్నారని, పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. వారి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. సాయి అభయంకర్ సంగీతాన్ని, గౌతమ్ జార్జ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగును యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ లోని పలు ప్రాంతాల్లో 120 రోజులకు పైగా నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.