
గుడియాత్తం గంగమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు
వేలూరు: జిల్లాలోని గుడియాత్తం గంగమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మదివాణన్ తెలిపారు. ప్రసిద్ధి చెందిన గంగమ్మ శిరస్సు జాతర ఈనెల 15న గురువారం జరగనుంది. బుధవారం ఉదయం అమ్మవారి రథోత్సవం, గురువారం ఉదయం శిరస్సు ఉత్సవం జరగనుంది. ఇందుకోసం వేలూరు, ఆంబూరు, తిరుపత్తూరు, చిత్తూరు వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ జాతరకు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లును సిద్ధం చేశారు. ఇందుకోసం మూడు తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు కారు పార్కింగ్‌లు నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. భక్తులు తొక్కిసలాట లేకుండా అవసరమైన పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి భక్తులు వచ్చి వెళ్లేందుకు వేర్వేరుగా దార్లు ఏర్పాటు చేయడాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఇందుకు భక్తులు సహకరించాలన్నారు. అదే బాణ సంచా వేడుకల చేసే ప్రాంతంలో అగ్గిపెట్టె, సిగిరేట్ వంటి వాటిని ఉపయోగించకుండా ఉండాలన్నారు. ఆలయ జాతరను పురష్కరించుకుని ఈనెల 15వ తేదీన వేలూరు జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. జాతర జరిగే ప్రాంతంలో అక్కడక్కడ తాగునీరు, మజ్జిగ వంటి శీతల పానియాలు ఏర్పాటు చేయాలన్నారు.