
పది మంది ప్రముఖులతో ధర్మయుద్ధం
తమిళసినిమా: తప్పాట్టం, ఉయిర్ తమిళుక్కు, యాంటీ ఇండియన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను నిర్మించిన ఆదం బాలా తాజాగా తన మూన్ పిక్చర్స్, డాక్టర్ ఆర్‌కే.శివకుమార్‌కు చెందిన బ్లానెట్ 9 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ధర్మయుద్ధం. సెంథమిళ్ సీమాన్ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో ఆర్‌కే.సురేశ్, నటి అనుచిత్ర నటిస్తున్నారు. ఎంఎస్.భాస్కర్, ఇళవరసు, వెట్రికుమరన్, సాటై దురై మురుగన్, జయకుమార్, ఆధిరా పాండియ లక్ష్మీసౌందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇ.సుబ్రమణియన్ కథ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను దర్శకుడు చేరన్, సుందర్.సి, శీను రామసామి, హెచ్.వినోద్, శశికుమార్, నిర్మాత సురేశ్ కామాక్షీ, నటుడు శివకార్తీకేయన్, సూరి, ప్రదీప్ రంగనాథన్, నటి కస్తూరి తదితర 10 మంది సినీ ప్రముఖులు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ధర్మయుద్ధం షూటింగ్‌ను తెన్‌కాశీ, కుట్రాళం, దిండుక్కల్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చిత్ర నిర్మాత ఆదం బాలా తెలుపుతూ తాను ఇంతకు ముందు నిర్మించిన యాంటీ ఇండియన్, ఉయిర్ తమిళుక్కు చిత్రాలు పూర్తిగా రాజకీయ నేపథ్యంలో రూపొందించినవనీ, అయితే ధర్మయుద్ధం చిత్రంలో రాజకీయ నేత సీమాన్ నటించినా, ఇందులో రాజకీయాలు ఏ మాత్రం ఉండవని చెప్పారు. ఆయన ఇందులో నిజాయితీగల పోలీస్ అధికారిగా నటించారని, ఆర్‌కే.సురేశ్ ఇంతకు ముందెప్పుడూ నటించని వైవిధ్యభరిత పాత్రలో నటించినట్లు చెప్పారు. మలయాళంలో మాత్రమే మంచి కథాంశాలతో కూడిన ఉత్కంఠభరిత కథా చిత్రాలు వస్తున్నాయనే టాక్ ఉందని, అయితే అలాంటి చిత్రాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈ ధర్మయుద్ధం ఉంటుందని చెప్పారు. దీనికి వైరముత్తు పాటలను, చెళియన్ ఛాయాగ్రహణం, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించినట్లు చెప్పారు.