
హజ్ యాత్రకు 5650 మంది ఎంపిక
సాక్షి, చైన్నె: తొలిసారిగా హజ్ యాత్రకు ఈ ఏడాది 5650 మంది ముస్లింలు ఎంపికయ్యారు. వీరికి తలా రూ.25 వేలు సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. పది మంది లబ్ధిదారులకు సీఎం స్టాలిన్ సబ్సిడీ మొత్తాన్ని శనివారం అందజేశారు. మహ్మద్ ప్రవక్త పంచ సూత్రాలలో హజ్ యాత్ర చివరిది. జీవితంలో ప్రతి ముస్లిం హజ్ చేయాలన్న నిబంధన ఉంది. ప్రతి ఏటా బక్రీద్ పండుగకు ముందుగా హజ్ యాత్ర నిమిత్తం సౌదీ అరేబియాలోని మక్కానగరానికి ముస్లింలు బయల్దేరి వెళ్తారు. జూన్ మొదటి వారంలో బక్రీద్ పండుగ నిర్వహించనున్నారు. పండుగకు ముందుగా హజ్‌యాత్ర ప్రారంభం కానున్నది. త్యాగానికి ప్రతీకగా ఉన్న పవిత్రపండుగ రోజున మక్కా నగరంలోని కాబా ఎదుట ప్రార్థన చేయడానికి ముస్లింలు సిద్ధమవుతారు.
5,650 మంది ఎంపిక
ప్రపంచ దేశాల నుంచి మైనారిటీలో హజ్ యాత్ర నిమిత్తం మక్కా, మదీనాలను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఈ యాత్ర నిమిత్తం కొంత మేరకు అవకాశాన్ని ముస్లింలకు కల్పిస్తున్నారు. ఆ దిశగా ఒక్కో రాష్ట్రం నుంచి అర్హులైన వారిని హజ్ కమిటీ ద్వారా ఎంపిక చేసిన హజ్ యాత్రకు సిద్ధం చేయడం జరుగుతోంది. ఆ దిశగా ఈ ఏడాది హజ్ యాత్ర ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 5650 మందిని ఎంపిక చేశారు. హజ్ యాత్రకు ఎంపికై న వారికి ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ అందజేస్తున్నది. ఆ మేరకు ఒకొక్కరికి రూ.25 వేలు చొప్పున సబ్సిడీని లబ్ధిదారులు అందజేసే కార్యక్రమం సచివాలయంలో ఉదయం నిర్వహించారు. పది మందికి సీఎం స్టాలిన్ తన చేతుల మీదుగా సబ్సిడీ మొత్తాన్ని అందజేశారు. మొత్తంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ.14.12 కోట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్.మురుగానందం, తమిళనాడు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ పి.అబ్దుల్ సమద్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ విజయరాజ్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.
లబ్ధిదారులకు రూ.25 వేలు సబ్సిడీ
10 మందికి అందజేసిన సీఎం