
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
తిరుత్తణి: విద్య, ఉపాధిపై విద్యార్థులను ప్రేరేపించే విధంగా తిరుత్తణిలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో 500 మందికి పైగా విద్యార్థినీవిద్యార్దులు పాల్గొన్నారు. సెంగుందర్ మహాజన సంఘం ఆధ్వర్యంలో టెన్త్, ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీవిద్యార్థులను సత్కరించడం, ఉపాధితో కూడిన విద్యకు సంబంధించి అవగాహన సదస్సును సెంగుందర్ కల్యాణ మండపంలో నిర్వహించారు. పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరుత్తణి మండలాల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న సదస్సుకు దక్షిణ భారతదేశ సెంగుందర్ మహాజన సంఘం అధ్యక్షుడు త్యాగరాజన్ అధ్యక్షత వహించారు. సంఘం కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కోశాధికారి ఉమాపతి స్వాగతం పలికారు. ఇందులో ఉపాధి శిక్షణ కల్పన శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ శంకరన్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఉన్నత చదువులపై అవగాహన కల్పించారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు ఉచిత గ్రూప్–4 శిక్షణ తరగతులు నిర్వహణకు సహాయకాలు అందజేశారు. దాతలను నిర్వాహకులు సత్కరించారు.