● ఓనం లాటరీలో కోవై యువకుడికి రూ. 25 కోట్లు
సాక్షి, చైన్నె: కేరళలో జరిగిన ఓనం ఉత్సవాల లాటరీ బంఫర్‌లో కోయంబత్తూరుకు చెందిన యువకుడికి రూ. 25 కోట్లు తగిలింది. ఒక్కసారిగా ఆ యువకుడు కోటీశ్వరుడు కావడంతో అతడి ఇంటి వద్ద సందడి నెలకొంది. వివరాలు.. కేరళ ప్రభుత్వం లాటరీ విక్రయాలను అధికారికంగా జరుపుతున్న విషయం తెలిసిందే. వారం లేదా పదిహేనురోజుల వ్యవధి లేదా పండుగ సందర్భంగా ప్రత్యేక బంఫర్ ఆఫర్ లాటరీల విక్రయాలను చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. మలయాళీల ముఖ్య పండుగ ఓనం సందర్భంగా తిరుఓనం బంపర్ లాటరీ విక్రయాలు జూలై నెల నుంచే జరిగాయి. మొదటి బహుమతి రూ. 25 కోట్లుగా ప్రకటించారు. 10 టికెట్లతో కూడిన సెట్ ధర రూ. 500గా ప్రకటించారు. 85 లక్షల లాటరీలను ముద్రించగా 75.76 లక్షలు అమ్ముడయ్యాయి. ఈ తిరు ఓనం లాటరీ డ్రా బుధవారం జరిగింది. ఇందులో తొలి బహుమతి రూ. 25 కోట్లు టీఈ–230662 నెంబరుకు తగిలింది. ఈ నెంబరు కలిగిన వ్యక్తి తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా అన్నూరుకు చెందిన నటరాజన్‌గా తేలింది. ఈ టికెట్‌ను 5 రోజుల క్రితం తాను కేరళ పాలక్కాడుకు వెళ్లిన సమయంలో వలయారులోని లాటరీ వ్యాపారి గురు స్వామి వద్ద నటరాజన్ కొనుగోలు చేసినట్టు తేలింది. డ్రైవర్ వృత్తిలో ఉన్న నటరాజన్ ఒక్క లాటరీతో కోటీశ్వరుడు కావడంతో అతడి ఇంటి వద్దకు బంధు గణం, మిత్రులు పరుగులు తీశారు. తన వద్ద ఉన్న లాటరీ టిక్కెట్టుతో పాలక్కాడుకు నటరాజన్ పరుగులు తీశారు. అన్ని రకాల పన్నులు, ఏజెంట్ కమీషన్లు పోగా నటరాజన్‌కు రూ. 12 కోట్ల నుంచి రూ.15 కోట్లు చేతికి అందే అవకాశం ఉందని లాటరీ విక్రయదారులు పేర్కొన్నారు. ఈ విషయం కోవైలో సంచలనంగా మారింది.