
అన్నామలై
● బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్య
సాక్షి, చైన్నె: నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాక్షించే వాళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో నా మట్టి..నా ప్రజలు పాదయాత్రకు ముందుగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి – అన్నాడీఎంకేకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అయితే అన్నామలై(తన)తో ఆ పార్టీ నాయకులకు కొన్ని అభిప్రాయభేదాలు ఉండవచ్చునేమో అని పేర్కొన్నారు. తన వరకు ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని పేర్కొంటూ, ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోదీ రావాలని ఆకాంక్షించే వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాంటి వారు తమ కూటమిలోనూ ఉంటారని పేర్కొన్నారు. కేంద్రంలో మూడోసారి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని ప్రకటించినప్పుడు, తమిళనాడులో తమ కూటమి సీఎం అభ్యర్థి పళణి స్వామి అని ఎందుకు ప్రకటించరంటూ అన్నాడీఎంకే నేత సెల్లూరు రాజు డిమాండ్ చేయడాన్ని గుర్తు చేయగా, ఇందుకు సమాధానం తాను కాదని, పార్టీ పెద్దలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, మాజీ సీఎం పన్నీరు సెల్వం మద్దతు నేత పుగలేంది మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో ఉన్నట్టా...? లేనట్టా..? అన్నది పళణి స్వామి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ కూటమిలో లేదని ప్రకటించిన మరుక్షణమే పళణి స్వామికి జైలు జీవితం తప్పదని ఎద్దేవా చేశారు.