
ఆలయ ప్రాంగణంలో పందకాల పూజ చేస్తున్న శివాచార్యులు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలకు పందకాల పూజ గురువారం శివాచార్యుల వేద మంత్రాల మధ్య వైభవంగా ప్రారంభమైంది. వివరాలు.. ఏటా అరుణాచలేశ్వరాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఆఖరి రోజు ఆలయం వెనుక వైపున ఉన్న శివుడిగా భావించే మహా కొండపై సాయంత్రం 6 గంటలకు మహా దీపాన్ని వెలిగించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ దీపాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై 27న ఉదయం భరణి దీపం, సాయంత్రం మహాదీపంతో ముగుస్తాయి. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలకు గాను ఆలయంలో విశేష అలంకరణలు, పందిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఉదయం 4.30 గంటలకు శివాచార్యుల వేద మంత్రాల నడుమ భక్తులు ఆలయంలోని మూడవ ప్రాకారంలోని సంపత్ వినాయకుడి సన్నిధిలో పందకాలను ఉంచి ప్రత్యేక పూజలు, అభిషేక ఆరాధన పూజలు జరిపారు. అక్కడ నుంచి వేద మంత్రాల నడుమ శివాచార్యులు భక్తులు పందకాలను హరోం.... హరా.... నామస్మరణాల మధ్య రాజగోపురం ఎదుటకు తీసుకొచ్చారు. అనంతరం రథం వీధిలో నిలిచి ఉంచిన రథానికి ప్రత్యేక పూజలు చేసి పందకాలను నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురుగేష్, ఆలయ జాయింట్ కమిషనర్ జ్యోతి, దేవదాయ శాఖ చైర్మన్ జీవానందం, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ జేసీ దీపోత్సవాలకు ఉపయోగించే వివిధ పంచరథాలతో పాటు ఉత్సవమూర్తులను తెరిచి మరమ్మతు పనులను ప్రారంభించారు.