కడప అర్బన్: వైఎస్సార్‌జిల్లా కడప రూరల్ సర్కిల్ చింతకొమ్మదిన్నె పోలీసులు తమ సిబ్బందితో కలిసి ఏడుగురు సభ్యులున్న గంజాయి స్మగ్లర్ల ముఠాను అరెస్ట్ చేశారు.వీరిలో ముగ్గురు చైన్నెలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కూడా ఉన్నారు. శుక్రవారం కడపలోని ‘పెన్నార్’పోలీస్ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఈ సంఘటన వివరాలను తెలియజేశారు. జిల్లాలో గంజాయి విక్రయాల ముఠాలను అరెస్ట్ చేస్తూ నిరంతరం దాడులు చేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో ఇద్దరిపై పీడీ యాక్ట్ ప్రయోగించామన్నారు. ఈ సంఘటనలో చింతకొమ్మదిన్నె పోలీసులు గంజాయి స్మగ్లింగ్ ముఠాలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. అరెస్టయిన వారిలో మైదుకూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న తిరుపతి వెంకట శివారెడ్డి, గుంటూరు జిల్లా కొట్టం రాజు వీధికి చెందిన ప్రస్తుతం చెన్నెలో నివాసం ఉంటున్న వాగోలు రాహుల్, కడప నగరం అక్కాయపల్లి వీధికి చెందిన గంగిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి ప్రధాన నిందితులన్నారు. వీరు ముగ్గురు చైన్నెలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతూ దురలవాట్లకు బానిసలుగా మారారన్నారు. మిగిలిన నిందితుల్లో కడప నగరం అక్కాయపల్లికి చెందిన మల్లప్పగారి మల్లికార్జున రెడ్డి, కడప నగరం నబీకోటకు చెందిన పాలగిరి పవన్‌కుమార్, కొట్టం ప్రతాప్, పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంకు చెందిన నరసింహులు ఉన్నారన్నారు. వీరి వద్ద నుంచి 21 కిలోల 600 గ్రాముల గంజాయిని, రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు సెల్‌ఫోన్‌లను సీజ్ చేశారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి గంజాయిని కొనుగోలు చేసి చైన్నెకి స్మగ్లింగ్ చేసి, తరువాత అక్కడి నుంచి కడపకు అక్రమంగా తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తారన్నారు. ఇక్కడి నిందితులు కడప నగరంలో, చుట్టు ప్రక్కల ప్రాంతాలకు వెళ్లి గంజాయిని అక్రమంగా విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారన్నారు. గంజాయిని వినియోగించినా, అక్రమ రవాణాకు, విక్రయాలకు పాల్పడినా వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతానికి గంజాయిని వినియోగిస్తున్న వారికి ‘డీ అడిక్షన్’కేంద్రాలకు పంపించి వారికి చికిత్సను అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. విద్యాసంస్థల వద్ద మహిళా పోలీసులతో నిఘా వుంచామన్నారు. ఎవరైనా గంజాయి విక్రయాలు, వినియోగించే వారి సమాచారాన్ని డయల్ 100 లేదా తన ఫోన్ నెంబర్: 94407 96900కు ఇవ్వాలనీ ఎస్పీ సూచించారు. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ రాజాప్రభాకర్, కడప తాలూకా సీఐ ఉలసయ్య, చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ భూమా అరుణ్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు విద్యాసాగర్, విశ్వనాథ్‌రెడ్డి, కానిస్టేబుళ్లు జనార్దన్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినంచారు. నగదు రివార్డులను అందజేశారు.