
తనయుడితో వైగో
● 14న సర్వసభ్యం భేటీ, ఎన్నిక ● అంతర్గత రాజకీయాలు, విభేదాలకు చోటు లేదన్న వైగో
సాక్షి, చైన్నె: మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే)లో గురువారం సంస్థాగత సందడి నెలకొంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, నిర్వాహక కమిటీ, ఇతర కమిటీల పదవులకు ముఖ్యనాయకులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈనెల 14న పార్టీ సర్వసభ్య సమావేశంతో పాటు ఎన్నిక జరగనుంది.
గతంలో డీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన పార్టీ ఎండీఎంకే అన్న విషయం తెలిసిందే. ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైగో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తన వారసుడు దురై వయ్యాపురిని వైగో రాజకీయ తెరపైకి తీసుకురావడంతో ఎండీఎంకేలో విభేదాలు బయలుదేరాయి. ప్రధాన కార్యదర్శి తర్వాత తామే అన్న ధీమాతో ఉన్న తిరుప్పూర్ దురైస్వామి, ఇతర నేతలు ప్రస్తుతం పార్టీని వీడారు. ఈ సమయంలో పార్టీ సంస్థాగత సమరానికి వైగో నిర్ణయించడం గమనార్హం. పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు ఇతర కమిటీలకు జరిగే ఎన్నికలలో పోటీ చేసే ముఖ్యనాయకులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. చైన్నె ఎగ్మూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఈ ప్రక్రియ జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి వైగో, ప్రిసీడియం చైర్మన్ పదవికి అర్జున్‌రాజ, కోశాధికారి పదవికి సెంథిల్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవికి దురై వైగో, సంయుక్త కార్యదర్శి పదవికి మల్లైసత్య నామినేషన్లు వేశారు. శుక్రవారం పరిశీలన, శనివారం మూడో తేదీ ఉపసంహరణ నిర్ణయించారు. జూన్ 14న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. పోటీ నెలకుంటే ఎన్నికలు జరుగుతాయి. లేనిపక్షంలో ఏకగ్రీవాలే. నామినేషన్ దాఖలుతో వైగో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలో అంతర్గత రాజకీయాలు, విభేదాలకు ఆస్కారం లేదన్నారు.