
మృతదేహాలను తరలిస్తూ..
సేలం: కోయంబత్తూరులో ప్రకటనల హోర్డింగ్ గురువారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయ పడ్డారు. కోయంబత్తూరు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ కరుమత్తం పట్టి గ్రామానికి రోడ్డు ఉంది. ఈమార్గం ప్రవేశంలో అతి పెద్ద ప్రకటనల హోర్డింగ్‌ను ఓప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసింది. ఇది సాయంత్రం హఠాత్తుగా కూలింది. ఈఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. విచారణలో ఈ హోర్డింగ్‌లోని బ్యానర్‌ను మార్చే సమయంలో ప్రమాదం జరిగినట్టు తేలింది. పది మంది కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం బలమైన గాలి వీయడంతో ఆ హోర్డింగ్ కుప్పకూలింది. పనుల్లో ఉన్న గుణశేఖర్, కుమార్, శేఖర్ మృతిచెందారు. మరో ఆరుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముగ్గురు యువకులు మృతి