
●తెలుగు, కన్నడ ప్రజలకు సీఎం స్టాలిన్ ఉగాది శుభాకాంక్షలు
కొరుక్కుపేట: ఉగాది పండుగ సందర్భంగా తమిళనాడులోని తెలుగు , కన్నడ ప్రజలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యతతో, సౌభాతత్వం, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు . తమిళనాడులో నివసిస్తున్న తెలుగు , కన్నడ భాషలు మాట్లాడే ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవును మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో తెలుగు, కన్నడ సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం స్టాలిన్ రుచికరమైన భోజనాలతో, ఆనందోత్సాహాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. దక్షిణాన విస్తరించి ఉన్న ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన వారైనందుకు గాను.. మన సంబంధం, ఐక్యత బలపడాలని, ద్రవిడ ప్రజల మధ్య సామరస్యం, సోదరభావంతో జీవించాలని, ప్రపంచ వ్యాప్తంగా మన భాష, సంస్కృతి , హక్కులను కాపాడుకోవాలని తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్రంలోని పలువులు నాయకులు సైతం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
