
లేడీ సూపర్ స్టార్ నటి నయనతార. అయితే ఈమెను అలా పేర్కొనడం ఇప్పుడు కొందరికి నచ్చడం లేదన్నది వేరే విషయం. ఇకపోతే తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉండే నయనతారకు ఇప్పుడు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇటీవల ఈమె నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడం ఒక కారణం కావచ్చు. ఆ మధ్య సరోగసీ పద్ధతి ద్వారా కవల పిల్లలకు తల్లి అయిన నయనతార కావాలనే నటనకు గ్యాప్ తీసుకుని ఉంటుందని కూడా భావించవచ్చు.
ఏదేమైనా నయనతార, విఘ్నశ్ శివన్ దంపతులకు పెళ్లి అయిన తరువాత కాలం కలిసిరావడం లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అజిత్ చిత్రం కోసం రెండేళ్లు శ్రమించిన దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇంకా షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఆ క్రేజీ చిత్రం నుంచి దర్శకుడు తొలగించబడ్డారు. ఇక నయనతార చేతిలో షారూఖ్ ఖాన్‌తో చేస్తున్న జవాన్ చిత్రం మినహా మరో చిత్రం లేదు. ఆ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార కొత్తగా మరో చిత్రానికి సిద్ధమైంది. ఇది ఈమె నటిస్తున్న 75వ చిత్రం కావడం గమనార్హం.
ఈ చిత్రం షూటింగ్‌కు ఇటీవల శ్రీకారం కూడా చుట్టారు. దీన్ని నాథ్ స్టూడియోస్, జీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నీలేష్ కృష్ణ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథాచిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో నటుడు జయ్, సత్యరాజ్, రెడిన్ కింగ్స్ లీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నయనతార, జయ్, సత్యరాజ్ కలిసి ఇంతకు ముందు రాజా రాణి అనే హిట్ చిత్రంలో నటించారు. కాగా చిత్ర షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.