భానుపురి (సూర్యాపేట) : జిల్లా పంచాయతీ ఎన్నికల్లో చివరిదైన మూడోదశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 146 గ్రామ పంచాయతీలు, 1,318 వార్డులకు సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం ఉదయం 10గంటల నుంచి 38 నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో ఆశావహుల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు పెట్టారు. తొలిరోజు సర్పంచ్ పదవికి 105, వార్డు సభ్యుల పదవికి 110 నామినేషన్ల చొప్పున దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 5వ తేదీ వరకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. 9వ తేదీన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి.. గుర్తుల కేటాయిస్తారు.
తొలిరోజు 215 నామినేషన్లు దాఖలు
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు, 4,388 వార్డులకు గాను మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మూడో విడత నామినేషన్ల స్వీకరణ తొలిరోజు నుంచే భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. మొదటి విడత తొలిరోజు 245 నామినేషన్లు రాగా.. రెండోవిడతలో కేవలం 105 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మూడో విడతలో మాత్రం పెరిగి 215 నామినేషన్లను ఆశావహులు అధికారులకు సమర్పించారు. ఇందులో అత్యధికంగా సర్పంచ్ కోసం గరిడేపల్లి మండలంలో 26 నామినేషన్లు వచ్చాయి. ఆ తర్వాత మఠంపల్లి మండలంలో 24, పాలకవీడులో 14 నామినేషన్లను వేశారు. ఇక అత్యల్పంగా మేళ్లచెర్వులో 7 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వార్డు సభ్యుల ఎన్నికకు అత్యధికంగా మఠంపల్లిలో 36 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా చింతలపాలెంలో రెండు మాత్రమే వచ్చాయి.
రెండోవిడతలో 5,825 నామినేషన్లు
నవంబర్30వ తేదీ నుంచి రెండోవిడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ఈ విడతకు మంగళవారం చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. కొన్నిచోట్ల రాత్రి 11.30 గంటల వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు. ఈ విడతలో మొత్తం 5,825 నామినేషన్లను ఆశావహులు సమర్పించారు. ఇందులో సర్పంచ్‌కు 1447, వార్డు సభ్యుల కోసం 4,378 నామినేషన్లు ఉన్నాయి. ఈ విడతలో 181 గ్రామ పంచాయతీలు, 1628 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
146 గ్రామపంచాయతీలు, 1318 వార్డుల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ
తొలిరోజు 215 నామినేషన్లు దాఖలు
ఈనెల 5వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం
9న తుది జాబితా, 17న పోలింగ్
తొలిరోజు ఇలా..
మండలం జీపీలు సర్పంచ్ వార్డులు వార్డు
నామినేషన్లు నామినేషన్లు
హుజూర్‌నగర్ 11 09 110 06
నేరేడుచర్ల 19 12 163 11
పాలకవీడు 22 14 186 10
గరిడేపల్లి 33 26 300 28
మఠంపల్లి 29 24 254 36
మేళ్లచెర్వు 16 07 152 17
చింతలపాలెం 16 13 148 02
మొత్తం 146 105 1318 110


