చట్టాల అమలులో అలసత్వం వహించొద్దు
సూర్యాపేటటౌన్: చట్టాల అమలులో పోలీస్ సిబ్బంది అలసత్వం వహించవద్దని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
వయోవృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : వికలాంగులు, వయోవృద్ధుల ఆరోగ్యం విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. సోమవారం సూర్యాపేట మండల పరిధిలోని గాంధీ నగర్‌లో గల స్నేహ నిలయం ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. సీనియర్ సిటిజన్లు, సంక్షేమ చట్టంపై అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వికలాంగులు, వృద్ధులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేసి, వారితో కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఈకార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో కార్తీక ఆరాధన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనుబంధ శివాలయంలో సోమవారం కార్తీక మాసం పూజలు కొనసాగాయి. కొండపైన గల శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా మహాశివుడికి రుద్రాభిషేకం, బిల్వా అర్చన పూజలు విశేషంగా నిర్వహించారు. ఆలయ యాగశాలలో రుద్ర యాగాన్ని జరిపించారు. సాయంత్రం శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి సేవను ఆలయంలో ఊరేగించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలను కొనసాగించారు. ఆలయంలో వైభవంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ వేడుక, జోడు సేవలు వంటి పూజలు అర్చకులు జరిపించారు.
19న జాబ్ మేళా
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఐటీఐ క్యాంపస్‌లో ఈ నెల 19న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ నుంచి గ్రాడ్యుయేట్, పార్మసీ ఉత్తీర్ణులై 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా తీసుకుని నేరుగా కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 78934 20435 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
చట్టాల అమలులో అలసత్వం వహించొద్దు
చట్టాల అమలులో అలసత్వం వహించొద్దు


