రూ.64లక్షలు కొల్లగొట్టారు
సైబర్ నేరానికి గురైన బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే కోల్పోయిన నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సైబర్ మోసాలు జరిగినప్పుడు 1930టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు. ఫోన్‌లకు వచ్చే అనవసరమైన లింక్‌లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి.
– లక్ష్మీనారాయణ, సైబర్‌క్రైం సీఐ
సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూపంలో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లకు వచ్చే మెసేజ్‌లను క్లిక్ చేయడం వల్ల కొందరు మోసపోతున్నారు. బ్యాంకింగ్ యాప్స్, ఫేక్ లింక్‌లు, లక్కీ డ్రాలు, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు, ఉద్యోగ ఆఫర్లు అంటూ అనేక మార్గాల్లో ఖాతాల్లోని నగదు మాయం చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఎక్కడో ఒక చోట సైబర్ మోసానికి గురవుతూనే ఉన్నారు. విద్యా వంతులు సైతం సైబర్ వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాగా కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరికొందరు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... ఆన్‌లైన్ మోసాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది. విద్యాసంస్థలు, గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్నారు. అత్యాశకు పోయి ఎక్కడో ఒక చోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. సైబర్ మోసాలకు పాల్పడే వారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో కేసు నమోదు చేసిన వారిని ఛేదించడం సవాల్‌గా మారుతోంది. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు అప్రమత్తంగా ఉంటే మేలు అని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన సామాన్య ప్రజలతో పాటు విద్యావంతులు కూడా చాలా వరకు మోసపోయి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.8కోట్లు..
ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 750పైగా సైబర్ కేసులు నమోదుకాగా రూ.8కోట్లకు పైగా డబ్బులను నేరగాళ్లు కొల్లగొట్టారు. అయితే ఈ ఒక్క నెల(నవంబర్)లోనే 127 కేసులు నమోదుకాగా రూ. 64,21,230 బాధితులు పోగొట్టుకున్నారు. ఇందులో రూ.13,14,163 ఫ్రీజ్ చేశారు. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు అప్రమత్తమై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తే కొంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
ప్రస్తుతం వాట్సాప్‌లలో ఏపీకే ఫైల్స్ విపరీతంగా వస్తున్నాయి. అలాగే ఇతర బ్లూ లింక్స్ వస్తున్నాయి. వాటిని ఆదమరిచి క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్ హ్యాక్ అయి మీ సమాచారం మొత్తం సైబర్ మోసగాళ్ల చేతికె వెళ్తుంది. దీంతో మీ ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని అపరిచితులు చెప్పితే నమ్మవద్దని, వారు సైబర్ మోసగాళ్లని గ్రహించాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వ్యక్తిగత వివరాలు అడగరు. అలాగే అడిగితే అది సైబర్ నేరస్తుల పనే. అనవసరమైన ఫోన్ కాల్స్, తెలియని లింకులను ఓపెన్ చేయకపోవడం మంచిది. బ్యాంక్ ఓటీపీ, పిన్, సీవీ వివివరాలను ఎవరికీ చెప్పవద్దు. రుణ యాప్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం, తదితర రకాల ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దు. ఫేక్ ప్రొఫైల్స్, క్యూ ఆర్ కోడ్స్, ఫేక్ జాబ్ ఆఫర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
నవంబర్‌లో అత్యధికంగా 127 సైబర్ కేసులు
ఫ రోజూ ఎక్కడో ఒక చోట
మోసపోతున్న బాధితులు
ఫ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌కు ఇటీవల పార్ట్‌టైం జాబ్ అంటూ వాట్సాప్‌లో
ఓ లింక్ వచ్చింది. దానిని ఓపెన్ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఓ యాప్ డౌన్‌లోడ్ అయింది. ఈ యాప్‌లో రూ.100 పెట్టుబడి పెడితే రూ.200 వస్తాయని అందులో చూపించింది. అయితే అతను రూ.100 నుంచి రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టగా రెండింతల డబ్బులు వచ్చాయి. దీంతో మరో సారి రూ.50వేలు పెడితే రూ.1లక్ష వచ్చాయి. దీంతో బయట వేరేవాళ్ల దగ్గర నుంచి రూ.9లక్షలు తీసుకొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లో పెట్టుబడి పెట్టాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టగానే సైబర్‌మోసగాళ్లు వెంటనే డబ్బులు రాకుండా చేశారు. ఆ యాప్‌లో ఆ మొత్తం కనడుతుంది. కానీ అవి తీసుకోవడానికి వీల్లేకుండా చేశారు. దీంతో బాధితుడు మోసపోయానని గ్రహించి 1930కి కాల్‌చేసి సైబర్ క్రైంను ఆశ్రయించగా కేసు నమోదుచేశారు. ఇలా జిల్లాలో చాలామంది సైబర్ మోసానికి గురవుతూనే ఉన్నారు.


