విధుల నిర్వహణలో పొరపాట్లుకు తావివ్వొద్దు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ సూచించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజాస్ నంద్‌లాల్ పవార్, జిల్లా వ్యయ పరిశీలకుడు హుస్సేన్‌తో కలిసి గ్రామపంచాయతీ ఎన్నికలపై ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ వ్యయ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎఫ్‌టీ విధులు కేటాయించిన సిబ్బంది ఎన్నికల కమిషన్ రూల్స్ పాటిస్తూ బాధ్యతాయుతంగా, కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్నారు. సహాయక వ్యయ పరిశీలకులు ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, ఏ రోజు నివేదికలు ఆ రోజే పంపించాలని సూచించారు. నివేదికల్లో ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితంగా ఉండాలన్నారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు మండలానికి ఒక బృందం చొప్పున ఉండాలని, సమావేశాలు, మీటింగ్‌లలో పీఎస్ సిస్టంతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతీది వీడియోగ్రఫీ చేయించాలని, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు తనిఖీల సందర్భంగా రూ.10వేలకు మించి ఆర్టికల్స్ తీసుకువెళ్తున్నా.. రూ.50 వేలకు మించి నగదును తీసుకువెళ్లే వారి వాహనాలను సీజ్ చేయాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, అసిస్టెంట్ వ్యయ అధికారులు సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఏదైనా నగదు, ఆర్టికల్స్, లిక్కర్స్ తరలిస్తే ఈ వ్యయాన్ని వారి ఖాతాలో జమ చేయాలన్నారు. లోకల్ ప్రింటింగ్ ప్రెస్ మీద నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే వ్యయ పరిశీలకుడు బి.హుస్సేన్ మాట్లాడుతూ ఏఈఓలు ఎంపీడీఓలతో కలిసి వారికి కేటాయించిన గ్రామపంచాయతీలను తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్‌డీఓ అప్పారావు, డీసీఓ ప్రవీణ్ కుమార్, జిల్లా ఫారెస్ట్ అధికారి సతీష్, జోనల్ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ పంచాయతీ ఎన్నికల సాధారణ
పరిశీలకుడు రవినాయక్
విధుల నిర్వహణలో పొరపాట్లుకు తావివ్వొద్దు


