పొంచి ఉన్న తుపానుతో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట టౌన్ : దిత్వా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల పంట ఉత్పత్తులు తడవకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది సెలవులు రద్దుచేసి విధుల్లో నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదాల స్థలాలు, నాలాలు, వంతెనలు, కల్వర్టుల వద్ద పికెట్ ఏర్పాటు చేశామని, వరద నీరు ప్రవహించే వాహనాలతో వంతెనల పైనుంచి వాహనదారులు రాకపోకలు సాగించవద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, సూర్యాపేట పోలీస్ కంట్రోల్ రూమ్‌కు నంబర్ 8712686026 ఫోన్ చేయాలని కోరారు.
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, నిత్యకల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, పణిభూషణమగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు.
శ్రీకాంతాచారి
వర్ధంతికి తరలిరావాలి
మోత్కూరు : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ తలపెట్టిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామరోజు వీరాచారి తెలిపారు. ఆదివారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాంతాచారి వర్ధంతికి తరలి రావాలని పిలుపునిచ్చారు.
పొంచి ఉన్న తుపానుతో అప్రమత్తంగా ఉండాలి


