గీతన్నల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించాలి
సూర్యాపేట: కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ ఫంక్షన్ హాల్ (వర్ధిల్లి బుచ్చిరాములు నగర్)లో మూడు రోజులుగా జరుగుతున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. డిసెంబర్ 23న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడతామన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినా గీత కార్మికుల సంక్షేమానికి ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టలేదన్నారు. రాష్ట్రంలో 4వేల కల్లుగీత సొసైటీలు, 3,600 టీఎఫ్‌టీల్లో 2,23,000 మంది గీత కార్మికులు ఉన్నారన్నారు. టాడి కార్పొరేషన్‌కు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి కేవలం రూ.30 కోట్లే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్ ప్రభుత్వ విధానాల మూలంగా మూతబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతి లేదన్నారు. అంతకుముందు ప్రతినిధుల సభలో తొమ్మిది తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్గూరి గోవింద్, రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు, నాయకులు ఉయ్యాల నగేష్, గుణగంటి కృష్ణ, నోముల వెంకన్న, వల్లపు దాసు సాయికుమార్ పాల్గొన్నారు.
ఫ కల్లుగీత కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ


