రెండో విడతకు సై..
తొలి రోజు నామినేషన్లు ఇలా..
భానుపురి (సూర్యాపేట) : రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని కోదాడ రెవెన్యూ డివిజన్‌లోని కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు మండలాలతో పాటు సూర్యాపేట రెవెన్యూ డివిజన్‌లోని పెన్‌పహాడ్, చివ్వెంల, మోతె మండలాలకు ఆదివారం ఉదయం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ వెంటనే ఆయా మండలాల్లోని 181 గ్రామ పంచాయతీల్లోని 181 సర్పంచ్, 1,628 వార్డు స్థానాల ఎన్నికలకు సంబంధించి 49 క్లస్టర్ సెంటర్లలో ఆశావహుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పలు మండలాల్లో పర్యటించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తొలి విడత మాదిరిగానే..
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత 8 మండలాలు, రెండో విడత 8 మండలాలు, మరో 7 మండలాలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ నామినేషన్లు మందకొడిగా వస్తున్నాయి. తొలిరోజు కేవలం 105 రాగా, ఇందులో సర్పంచ్‌కు 67, వార్డు స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలుకూరు, పెన్‌పహాడ్ మండలాల్లో అసలు వార్డు సభ్యుల నామినేషన్లు ఖాతా కూడా తెరవలేదు. అత్యధికంగా సర్పంచ్‌కు చివ్వెంల మండలంలో 15, పెన్‌పహాడ్ మండలంలో 13 దాఖలయ్యాయి. వార్డు మెంబర్లలో అత్యధికంగా అనంతగిరి నుంచి 12, మునగాల మండలంలో 11 నామినేషన్లు వేశారు.
బేరీజు వేసుకుంటూ..
సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో ఎనిమిది మండలాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం పోటీ చేసే ఆశావహులు వివిధ పార్టీలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోసం తపనపడుతున్నారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసే ఏర్పాట్లలో ఉన్నారు. ఇక వార్డు సభ్యుల ఎన్నిక ఇప్పటికే పార్టీలకు అతీతంగా కొన్నిచోట్ల, పార్టీల వారీగా పొత్తులు కుదుర్చుకుని అభ్యర్థిగా ఎవరైతే గెలుస్తామనే బేరీజు వేసుకుని ఇద్దరు ముగ్గురిని బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి రోజు నామినేషన్‌కు కావాల్సిన పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. చివరి రోజే అధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ విడతలో నామినేషన్ల స్వీకరణకు మంగళవారం వరకు గడువు ఉండగా 14వ తేదీన పోలింగ్ జరగనుంది.
మండలం జీపీలు సర్పంచ్ వార్డులు వార్డులకు
నామినేషన్లు నామినేషన్లు
చిలుకూరు 17 04 158 00
కోదాడ 16 06 158 08
అనంతగిరి 20 07 178 12
మునగాల 22 10 210 11
నడిగూడెం 16 03 148 02
మోతె 29 09 262 01
చివ్వెంల 32 15 258 04
పెన్‌పహాడ్ 29 13 256 00
మొత్తం 181 67 1,628 38
ఫ 181 గ్రామ పంచాయతీల్లో
మొదలైన నామినేషన్ల ప్రక్రియ
ఫ తొలి రోజు 105 నామినేషన్లు దాఖలు
ఫ రేపటి వరకు గడువు


