దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేట : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం–2025 సందర్భంగా రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం అర్హులైన దివ్యాంగ వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి కె.నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు, సంస్థలు ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటలలోగా సూర్యాపేట లోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి ఎంపిక చేయనుందని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
జిల్లా మొదటి అదనపు
జడ్జిగా రాధాకృష్ణ చౌహాన్
సూర్యాపేట, హుజూర్‌నగర్ : సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా ఎం.రాధాకృష్ణ చౌహాన్ నియమితులయ్యారు. హుజూర్‌నగర్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఈయనకు జిల్లా మొదటి అదనపు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన ఎం.శ్యామ్‌శ్రీ నా లుగు నెలల క్రితం బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టులో రాధాకృష్ణ చౌహాన్‌ను నియమించారు. అలా గే హుజూర్‌నగర్ రెండవ అదనపు జిల్లా జడ్జిగా, పోక్సో కోర్టు న్యాయమూర్తిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే రెండు రోజుల్లో ఆయన నూతన బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సూర్యాపేట : ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజీ పడే కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. బాల్య వివాహలు చట్టరీత్యా నేరమన్నారు. మహిళలకు డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచిత న్యాయసేవలతో పాటు, సలహాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, మిడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి డిప్యూటీ
డీఎంహెచ్‌ఓగా వేణుగోపాల్
హుజూర్‌నగర్ : మండలంలోని లింగగిరి ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంఎంహెచ్‌ఓగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు పనిచేసిన డాక్టర్ జయమనోరి పదోన్నతి పొందారు. దీంతో డాక్టర్ వేణుగోపాల్ నాయక్‌ను ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా నియమిస్తు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వేణుగోపాల్ గతంలో ఆర్మీలో మేజర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
15 వరకు గాలికుంటు నివారణ టీకాలు
హుజూర్‌నగర్ : జిల్లాలో ఈ నెల 15 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నామని జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. పశువులకు టీకాలు వేసే గ్రామాల్లో రైతులకు ఒకరోజు ముందే తెలియపర్చాలన్నారు. ఆయన వెంట పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు కందుల సత్యనారాయణ, ఎల్‌ఎస్‌ఏ దుర్గాభవాని, సిబ్బంది మహమ్మద్ ఇస్మాయిల్ ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
దరఖాస్తుల ఆహ్వానం


