ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో..
చౌటుప్పల్ రూరల్: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెగూడెం గ్రామానికి చెందిన గండికోట విగ్నేష్(26) ఇంటర్ వరకు చదివి ట్రాక్టర్ కొనుక్కొని గ్రామంలోనే తమకున్న వ్యవసాయ భూమితో పాటు మరో 10ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. విగ్నేష్ అన్న దుబాయ్‌లో పనిచేస్తుండగా దీపావళి పండగకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం విగ్నేష్ అన్న తిరిగి దుబాయ్‌కి వెళ్తుండడంతో అతడిని కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దించి వచ్చాడు. అనంతరం రాత్రి తాను ప్రేమించిన యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన విగ్నేష్ తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేశాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లి చూడగా.. అప్పటికే విగ్నేష్ పురుగుల మందు తాగి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం విగ్నేష్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు దుబాయ్ నుంచి రాగానే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి గండికోట రాందాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నర్సిరెడ్డి తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫ పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య


