ఆరు నెలలైనా పనులు అంతంతే
కోదాడ: జాతీయరహదారి–65పై కొమరబండ వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఆరు నెలలైనా ఆరడుగులు కూడా ముందుకు సాగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముందుకు సాగని పనులు
65వ నంబర్ జాతీయ రహదారిపై అధిక ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను అధికారులు బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. కోదాడ పరిధిలోని కొమరబండ వై జంక్షన్ వద్ద రూ. 36 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఈ సంవత్సరం మేలో పనులు ప్రారంభించారు. పని ప్రదేశంలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి కోదాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను హుజూర్‌నగర్ రోడ్డు మీదుగా బైపాస్ రోడ్డు వరకు దారి మళ్లించారు. పనుల్లో భాగంగా రోడ్డును తవ్వి సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేశారు. కానీ అండర్‌పాస్ టన్నెల్ పనులు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఆరు నెలలైనా టన్నెల్ గోడలు పది అడుగులు కూడ కట్టలేదు. ఇదే రీతిగా పనులు జరిగితే పూర్తి కావడానికి ఐదారు సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా అండర్‌పాస్ టన్నెల్ పనులు పూర్తి చేస్తే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, త్వరాత ప్‌లైవర్‌కు ఇరువైపులా రోడ్డు పనులను నెమ్మదిగా చేసినా సమస్య ఉండదని వాహనదారులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్ మాత్రం తనకు వచ్చే మార్చి వరకు సమయం ఉందని చెపుతున్నాడని స్థానికులు వాపోతున్నారు.
నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు
ప్‌లైఓవర్ నిర్మాణం కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను హుజూర్‌నగర్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు. దాంతో ఈ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దాంతో పాటు కట్టకొమ్ముగూడెం రోడ్డు వద్ద క్రాసింగ్‌ను పూర్తిగా మూసివేయడంతో ఆ రోడ్డు గుండా వెళ్లే 10 గ్రామాల ప్రజలతో పాటు పట్టణంలోని ఉత్తమ్ పద్మావతినగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొమరబండ వై జంక్షన్ వద్ద రోడ్డు దాటేందుకు వీలు లేక పోవడంతో మునగాల మండలం ఆకుపాముల వైపు వెళ్లాల్సిన వారు రాంగ్‌రూట్‌లో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రిపూట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన శ్రద్ధ వహించి ఫ్లైఓవర్‌ను త్వరగా పూర్తి చేయించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.
ఫ నత్తనడకన కొమరబండ
ఫ్లైఓవర్ నిర్మాణం
ఫ జాతీయ రహదారిపై
రూ. 36 కోట్లతో పనులు
ఫ కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ఫ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ఆరు నెలలైనా పనులు అంతంతే


