సర్వేయర్లు వస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

సర్వేయర్లు వస్తున్నారు

Oct 23 2025 9:24 AM | Updated on Oct 23 2025 9:24 AM

సర్వేయర్లు వస్తున్నారు

సర్వేయర్లు వస్తున్నారు

ప్రభుత్వ ఆదేశాల మేరకు

నియామకం

సర్వే ఆధారంగానే వేతనం

భానుపురి (సూర్యాపేట) : భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు సిబ్బంది కొరతను అధిగమించేందుకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాకు 155 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు అందుబాటులోకి వచ్చారు.దాంతో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిష్కారం కావడంతో పాటు భూముల విక్రయాలు, కొనుగోళ్లు ఇక పక్కాగా జరుగనున్నాయి.

సిబ్బంది కొరతతో సేవల్లో జాప్యం

సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉన్నాయి. ఒక్కో మండలానికి ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జిల్లా మొత్తంగా 15 మంది ప్రభుత్వ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. వీరు వివాదంలో ఉన్న భూములను సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో భూ వివాదాలు పెరగడంతో మండలానికి ఒక్కో సర్వేయర్‌ కూడా లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వ, దేవాదాయ శాఖలకు సంబంధించి భూముల హద్దుల గుర్తింపులోనూ నెలల తరబడి సమయం పడుతోంది. రైతుల భూసర్వేలు ఆలస్యమై అవస్థలు పడుతున్నారు. వారిచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండి అధికారులపైనా ఒత్తిడి పెరుగుతోంది.

అందుబాటులోకి సర్వేయర్లు

ఇటీవల లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అర్హుల నుంచి రెండు విడతల్లో దరఖాస్తులను స్వీకరించింది. మొదటి విడుతలో 519 మంది దరఖాస్తు చేసుకున్నారు. శిక్షణకు 238 మంది మాత్రమే హాజరయ్యారు. 195 మంది పరీక్ష రాశారు. కేవలం 80 మందే ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీకి అవకాశం కల్పిస్తే మరో 86 మంది పాసయ్యారు. మొత్తంగా 166 మంది ఉత్తీర్ణత సాధించగా లైసెన్స్‌లు తీసుకునేందుకు 155 మంది రిపోర్ట్‌ చేశారు. దీపావళికి ముందురోజే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వీరికి లైసెన్స్‌ పత్రాలు అందించారు. ఈ లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను మండలాలకు కేటాయించనున్నారు.

రెండో విడతలోనూ

రెండోవిడతగా దరఖాస్తులు ఆహ్వానించగా 280 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 196 మంది మాత్రమే రిపోర్ట్‌ చేశారు. వీరికి ఈ నెల 26న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. వీరు అందుబాటులోకి వస్తే సిబ్బంది కొరత తీరనుంది.

జిల్లాలో శిక్షణ పొంది, పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 155 మందికి సీఎం లైసెన్స్‌లు అందించారు. వీరి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిని మండలాలకు కేటాయిస్తాం. త్వరలో మరికొంత మంది సర్వేయర్లు అందుబాటులోకి వస్తారు. దాంతో వివాదాలు లేకుండా భూ విక్రయాలు జరుగుతాయి.

–శ్రీనివాస్‌రెడ్డి, భూసర్వే అధికారి

ఫ జిల్లాకు 155 మంది

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

ఫ ఇటీవల సీఎం చేతుల మీదుగా ధ్రువపత్రాల అందజేత

ఫ త్వరలో మండలాలకు కేటాయింపు

ఫ తీరనున్న భూ సమస్యలు

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ప్రభుత్వం ఎలాంటి వేతనాన్ని ప్రకటించలేదు. కేవలం వారు చేసిన భూమి సర్వే ఆధారంగానే మూడు విడుతల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో స్లాట్‌ బుకింగ్‌లోనే సర్వేయర్‌ పేరు కూడా వస్తుంది. ఈ మేరకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ భూమిని సర్వే చేసి హద్దులు నిర్ధారించి రెగ్యులర్‌ సర్వేయర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తహసీల్దార్‌ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 2 ఎకరాల్లోపు భూమి సర్వే చేస్తే రూ.వెయ్యి ఇవ్వనున్నారు. 2 నుంచి 5 ఎకరాలకు రూ.2 వేలు, 5 నుంచి 10 ఎకరాలకు రూ.5వేలు, 10 ఎకరాలకు పైగా ఉంటే రూ.5వేలు ఇవ్వనున్నారు. ఈ సొమ్ము కూడా మూడు విడుతల్లో ఫీల్డ్‌ విజిట్‌కు 30 శాతం, మ్యాప్‌ తయారీ తర్వాత 30 శాతం, సర్వేయర్‌కు నివేదిక ఇస్తే మరో 35 శాతం ఇవ్వనుండగా 5 శాతం డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement