అనవసర లింక్‌లను క్లిక్ చేయొద్దు
ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్‌టీఏ చలాన్, టీఎస్ చలాన్ యాప్‌ల పేరుతో నకిలీ ఏపీకే ఫైల్స్‌ను పంపుతున్నారని, వాటిని డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ ఫైల్స్, లింక్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్ల మొబైల్ ఫోన్ హ్యాక్‌కు గురవుతుందన్నారు. దాంతో మన అనుమతి లేకుండానే మోసగాళ్లకు ఓటీపీ, మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా ఫార్మర్డ్ అవుతాయని వాటి ద్వారా వారు బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులను దొంగిలిస్తారని తెలిపారు. అటువంటి ఫైల్స్ పోలీసులు, ప్రభుత్వ నుంచి వచ్చినట్లు కనిపించినప్పటికీ వాటిని క్లిక్ చేయవద్దని, ఇన్‌స్టాల్ చేయవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే పోలీస్‌స్టేషన్‌లో గానీ, 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
లక్ష్మీనరసింహుడికి
స్వాతి నక్షత్ర కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామికి బుధవారం స్వాతి నక్షత్ర కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం, నిత్య కల్యాణ తంతు చేపట్టారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు, బ్రహ్మాచార్యులు పాల్గొన్నారు.
వీఆర్‌ఏల క్రమబద్ధీకరణను రద్దు చేయాలి
నాగారం : వీఆర్‌ఏల అక్రమ క్రమబద్ధీకరణను రద్దు చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా జీఓ నం. 81, 85 ద్వారా వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించిందన్నారు. 16,758 మంది వీఆర్‌ఏలను వివిధ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించడం వల్ల టీజీపీఎస్సీ అభ్యర్థులకు అన్యా యం జరుగుతుందన్నారు. ఈ జీఓను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా దానిని అమలు చేయకుండా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. ఆయన వెంట బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి కొండమీది నర్సింహారావు, జిల్లా ఉపాధ్యక్షుడు శతకోటి పరశురాం, కార్యదర్శి బడికిల అనిల్ ఉన్నారు.
పోలీస్ అమరవీరులకు నివాళులు
సూర్యాపేటటౌన్ : పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా బుధవారం ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, పోలీసు అధికారులు జిల్లా కేంద్రంలోని పోలీస్ అమరులు హెడ్ కానిస్టేబుల్ ఎండీ బడేసాబ్, ఉగ్రవాదుల దాడిలో అమరుడైన హోంగార్డు మహేశ్వర్‌ల ఇంటికి వెళ్లి వారికి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు పోలీస్‌శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డీఎస్పీ నరసింహాచారి, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ సంఘం అధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అనవసర లింక్‌లను క్లిక్ చేయొద్దు


