రుణసాయం అంతంతే!
లక్ష్యం మేరకు రుణాలు ఇస్తాం
భానుపురి (సూర్యాపేట) : రుణాల మంజూరులో బ్యాంకర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంకర్లు మంజూరు చేసిన రుణాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ ఆ దిశగా రుణాలు మంజూరు చేయడం లేదు. ప్రాధాన్యంగా వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలపై బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారు. ఈ త్రైమాసికంలో మొత్తంగా 11,919.74 కోట్ల రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం విధించింది. ఇప్పటి వరకు కేవలం 3,843.28 కోట్లు (32.24 శాతం) మాత్రమే అందించాయి. బ్యాంకర్ల తీరుతో రుణాలు తీసుకుందామనుకున్న వినియోగదారులు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రాధాన్యత రంగానికి 29.53 శాతమే!
ఏటా తయారు చేసే వార్షిక రుణ ప్రణాళికను ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలుగా విభజిస్తారు. ప్రాధాన్యత రంగానికి సంబంధించి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రుణాలను అందించాల్సి ఉంటుంది. ఇందులో అన్నదాతలకు పంట రుణాలు, భూముల అభివృద్ధి, నీటి పారుదల సౌకర్యాల కల్పన, వ్యవసాయ యంత్ర కొనుగోలు, పాడి పరిశ్రమ, కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు, స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాలు వంటివి ప్రాధాన్యత రంగం కిందకు వస్తాయి. ఈ మేరకు ప్రాధాన్యత రంగానికి అధిక మొత్తంలోనే దాదాపు 9,723.13 కోట్ల రుణలక్ష్యాన్ని మొదటి త్రైమాసికంలో విధించారు. అంత బాగానే ఉన్నా రుణాల మంజూరులో మాత్రం బ్యాంకర్లు చిన్నచూపు చూస్తూ కేవలం రూ.28.71కోట్లే (29.53 శాతమే) అందించాయి.
ప్రాధాన్యేతర రంగానికి..
ఇందులోనే ప్రత్యేకంగా వ్యవసాయరంగానికి రూ.3,915.15 కోట్లు కేటాయించగా 29.08 శాతంతో రూ.1,138.49 కోట్లే ఇచ్చారు. దీర్ఘకాలిక రుణాల్లో రూ.2,979.48 కోట్లు కేటాయించగా 36.59 శాతంతో 1,097.63 కోట్లు అందించినట్లు ఇటీవల వెల్లడించిన వార్షిక రుణ ప్రణాళికలో తెలిసింది. ఇక ప్రాధాన్యేతర రంగాలకు బ్యాంకర్లు పెద్దపీట వేస్తున్నారు. ఈ రంగంలో 2,196.61 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా..ఇప్పటి వరకు రూ.971.95 కోట్లను అందించడం గమనార్హం. దాదాపు ఇతర రంగాలకు ఇచ్చిన దానికంటే అధికంగా రుణాలను ఈ రంగంలో ఇచ్చారు.
మొదటి త్రైమాసికంలో లక్ష్యం చేరని బ్యాంకర్లు
ఫ రూ.11,919.74 కోట్లకు రూ.3,843.28 కోట్లే మంజూరు
ఫ వ్యవసాయ రంగంపై చిన్నచూపు
ఫ ప్రాధాన్యేతర రంగాలకు
44.25 శాతం రుణాలు
ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో రుణాల మంజూరులో వేగం పెంచుతాం. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని సాధించేలా ముందుకు సాగుతాం. ప్రతిఒక్కరూ బ్యాంకర్లకు సహకరించాలి. వ్యవసాయ రంగానికి అధిక రుణాలు ఇస్తాం.
– వెంకటనాగప్రసాద్, ఎల్‌డీఎం
రుణాలు లక్ష్యం(రూ.కోట్లలో) ఇచ్చింది శాతం
వ్యవసాయ 3,915.15 1,138.49 29.08
దీర్ఘకాలిక 2,979.48 1,097.63 36.59
ప్రాధాన్యరంగం 9,723.13 2,871.33 29.53
ఇతర ప్రాధాన్యం 2,196.61 971.95 44.25


