డప్పుల దరువులతో ఊళ్లన్నీ చిందులేస్తున్నాయి. గజముద్దలు అమ్మవారి ప్రతిరూపాలై ఊరేగుతున్నాయి. కాళికా వేషధారులతో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. ఊరి సంబరాలతో పల్లె మాగాణం సంబరాల గానం ఆలపిస్తోంది. ఈ ఉత్సవాల దయ వల్ల కళాకారులకు ఉపాధి లభిస్తోంది. పల్లెలను పచ్చగా చూసే తల్లులు, గ్రామ సరిహద్దుల్లో ఉంటూ తమ బిడ్డలను కాచే కల్పవల్లులు, పల్లె పొలిమేరల్లో కొలువై ఉన్న శక్తి స్వరూపిణులను గ్రామీణులు కొలిచి తరిస్తున్నారు.
జాతరలు, ఉత్సవాలు, సంబరాలు జరిగితే చాలు కళాకారులకు అసలైన పండగే. ఈ ఉత్సవాలు జరిగే సమయాల్లో క్షణం తీరుబాటు లేకుండా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అమ్మవారి సన్నాయి మేళం కళాకారులు, వీధి వేషధారణలు వేసే కళాకారులు, కోయ నృత్యం, అంజాట, తప్పెట గుళ్లు, పాములోళ్లు, డప్పు కళాకారులు, కాళికా వేషధారణ, పులి, సింహాల వేషధారులు, కోలాటం కళాకారులు.. ఇలా ఒకటేమిటి వంద లాది మంది కళాకారులకు ఈ ఉత్సవాలు ఉపాధి కల్పిస్తుంటాయి. ఉత్సవాలు అనగానే చిన్నారుల నుంచి వృద్ధులు వరకు సరదాగా గడుపుకునే పండగ. ఈ ఉత్సవాలు సమయాల్లో చిరు వ్యాపారులకు అసలైన పండగే. వీధుల్లో చిన్నపాటి దుకాణాల నుంచి సర్కస్, జాయింట్ వీల్, డిస్కో చైర్స్ వంటి పరికరాలతో ఉపాధి పొందుతుంటారు వ్యాపారులు.
ఇచ్ఛాపురం రూరల్:
చైత్రాన మొదలైన సంబరాలు ఆషాఢం వరకు కొనసాగుతూనే ఉంటాయి. సంబరాల వేళ ఉద్దానం పచ్చ కోక కట్టుకుని మురిసిపోతోంది. అమ్మవారి ఆలయాలు, వీధులు రంగురంగుల విద్యుత్ దీపాల తో ముస్తాబై, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. ఒకనాడు పల్లెల్లో నిత్యం కరువు కాటకాలు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు, తీవ్ర దుర్భిక్ష, దుర్భర పరిస్థితులు ఉండేవి. ఈ పరిస్థితుల నుంచి కాపాడాలని ఏటా పల్లె వాసులు అమ్మవార్లకు చల్లదనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి కృతజ్ఞత తెలిపే విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చైత్ర మాసం మొదలైన నుంచి జ్యేష్ట మాసం వరకు ప్రతీ ఏడాది గ్రామస్తులు ఐక్యంగా గ్రామదేవతకు చల్లదనాలు చేస్తుండగా, పదేళ్లకు ఓ సారి 5,7,9 రోజులు పాటు గ్రామ దేవత ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ సమయాల్లో సహజ సిద్ధంగా పండిన తాజా జీడి, మామిడి, పనస, పైనాపిల్ వంటి ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆది, మంగళ, గురువారాల్లో పొలి మేరలో ఉన్న దేవతలకు మేళతాళాలతో వెళ్లి మొక్కుబడులు తీర్చుకుంటారు.
గ్రామ దేవత ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శన
ఇంటింటా ఆధ్యాత్మికత
ప్రస్తుతం సిక్కోలులోని ప్రతి ఇంటా పసుపు, కుంకుమలతో సువాసనలు వెదజల్లుతుండగా, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు, పూజా సామగ్రి సమర్పిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి సేవల్లో కుటుంబాలంతా నిమగ్నమవుతున్నాయి.
అంబరాన్ని తాకుతున్న గ్రామ దేవత సంబరాలు
వాడవాడలా అమ్మవారి జాతరలు
పొటాపోటీగా గ్రామాల్లో ఉత్సవాల ఏర్పాట్లు
ఉపాధి పొందుతున్న కళాకారులు


