ప్రభుత్వ కొలువు..
ఏజెంట్ల మోసాలే ఎక్కువ..
శ్రీకాకుళం క్రైమ్ : ఎలా అయినా ఉద్యోగం సంపాదించాలన్న నిరుద్యోగుల బలహీనతే వారి ఆయుధం. పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు, మినిస్టర్లతో పరిచయాలున్నాయి, మీ వాడికి జాబ్ పక్కా.. అంతా మా చేతుల్లో ఉందంటూ కుటుంబ పెద్దలకు నమ్మించేలా మాయమాటలు చెప్పడమే వీరి నైజం. కార్లలో దిగుతూ, చక్కని వస్త్రధారణ, చేతివేళ్లన్నింటికీ ఉంగరాలు పెట్టి మసిపూసి మారేడు కాయ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య..
జిల్లాలో ఇటీవల కాలంలో ఉద్యోగాల పేరిట మోసాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలో నలుగురు నిరుద్యోగుల నుంచి ఓ వ్యక్తి రూ. లక్షల్లో కొట్టేశాడు. రైల్వేలోను, ఇతర ప్రభుత్వ విభా గాల్లో జాబులిప్పిస్తామని మోసగించినట్లు సమాచారం. విదేశీ ఉపాధి, ఉద్యోగాల పేరిట పలు కంపెనీలు, సంబంధిత ఏజెంట్లు సైతం గ్రామాల్లో ఉన్నవారిని మోసగిస్తుండటం ఓ దినచర్యగా మారిపోయింది. ఈ రోజుల్లో ఏ ఉద్యోగమైనా కష్టపడి చదివితేనే సంపాదించగలరని, అంతా ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా జరుగుతున్న ఇలాంటి రోజుల్లో ఎలాంటి పైరవీలకు చోటుండదని నిరుద్యోగ యువ త, వారి కుటుంబ సభ్యులు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు.
మోసాలను పరిశీలిస్తే..
● వజ్రపుకొత్తూరుకు చెందిన కారి బాలకృష్ణ అనే ఏజెంటు యూరోపియన్ దేశమైన స్వీడన్‌లో డ్రైవర్, వెల్డర్, ఫిట్టర్‌లో జాబ్‌లిప్పిస్తానని నమ్మించి మూడేళ్ల క్రితం ఇప్పిలి గిరిబాబు (కొండవూరు), పల్లివూరుకి చెందిన దున్న ఢిల్లీరావు, దున్న జానకిరావుల వద్ద రూ. లక్షల్లో తీసుకుని మోసం చేశాడు. ప్రస్తుతం విశాఖలో ఉన్నా బాధితుల ఫోన్లు ఎత్తడం మానేశాడు.
● నెల్లూరు జిల్లాకు చెందిన గొల్ల బెనర్జీ (33) ఢిల్లీ సెంట్రల్ జోన్ ఆడిట్ అధికారినని చెప్పి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి కోట్లాది రూపాయల వసూలు చేసి మోసగించాడు. విశాఖలో 8 మంది నుంచి రూ. కోటి, తిరుపతిలో సుబ్రహ్మణ్యం నుంచి రూ. 25 లక్షలు, జిల్లాలో నందిగాం మండలం దేశెట్టి రమణమూర్తి నుంచి రూ. 1.05 కోట్లు, ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేశాడు.
● ఈవై మల్టీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సత్యసాయి జిల్లాకు చెందిన గోపాల్‌రెడ్డి, నాగేంద్రరెడ్డిలు నగరానికి చెందిన ఎం.విజయలక్ష్మిని పావుగా వాడుకుని ఆమెతో పాటు మరికొందరికి రూ. 15.25 లక్షలు బురిడీ కొట్టారు.
● హిరమండలానికి చెందిన బోయిన జనార్ధనరావు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఐదుగురి వద్ద రూ. 13.5 లక్షలు వసూలు చేశాడు.
● ఎలాంటి రాత పరీక్షలు లేకుండా పీహెచ్‌సీల్లో నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ సంస్థ మహిళల నుంచి రూ. లక్షల్లో దండుకుంది.
● వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు చెందిన 30 మందికి పైగా నిరుద్యోగ యువతకు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించిన పలాస సమీప సువర్ణాపురం వాసి కె.గోపాలకృష్ణ, విశాఖకు చెందిన హరీష్ అనే వ్యక్తితో కలసి దాదాపు రూ. 2 కోట్లకు టోకరా వేశాడు.
2021 కరోనా సమయంలో విదేశాల్లో ఉన్న యువత కుప్పలు తెప్పలుగా వచ్చేశారు. మళ్లీ 2023–24 నుంచి ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఉపాధి నిమిత్తం వెళ్లినా.. దాదాపు 2126 మంది వరకు ఏజెంట్లు మోసం చేయడంతోను, మంచి కంపెనీలు కాకపోవడంతోను వెళ్లలేదన్నది సమాచారం. 2024 నుంచి ఇప్పటివర కు జిల్లాలో దాదాపు 200కు పైగా ఉద్యోగాల పేరి ట మోసపోయిన కేసు లు నమోదవ్వగా నమోదు కానివి దాదా పు 342కు పైగా ఉంటా యని అధికార వర్గాల అంచనా.
నిరుద్యోగులను నమ్మిస్తున్నారు
ఉద్యోగాలంటూ ముంచేస్తున్నారు
జిల్లాలో ఇటీవల పెరుగుతున్న మోసాలు
విదేశాల్లో ఉపాధి పేరిట ఏజెంట్లు,
కంపెనీల మోసాలు
డబ్బులిస్తే ఉద్యోగాలిచ్చే రోజులు పోయాయి..
డబ్బులిస్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. ఆన్‌లైన్ విధానంలో, పారదర్శకంగా జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ఇంకా నిరుద్యోగులు ఇలాంటివారి ఉచ్చులో పడ టం బాధాకరం. నిరుద్యోగుల బలహీనత పట్టుకుని బ్రోకర్లు, మధ్య వర్తులు, ఏజెంట్లు ఇలా చేస్తుంటే వారికి కష్టపడిన సొమ్మును ధారాదత్తం చేస్తున్నారు.
– పాత్రిని శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్), శ్రీకాకుళం


