పరిశ్రమల ఆన్‌లైన్‌ సేవలకు హెల్ప్‌డెస్క్‌ | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల ఆన్‌లైన్‌ సేవలకు హెల్ప్‌డెస్క్‌

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

పరిశ్రమల ఆన్‌లైన్‌ సేవలకు హెల్ప్‌డెస్క్‌

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయంలో ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ కార్యక్రమం కింద పరిశ్రమల ఆన్‌లైన్‌ సేవలకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు ఏపీ పీసీబీ ఈఈ బి.కరుణశ్రీ తెలిపారు. పీసీబి చైర్మన్‌ పి.కృష్ణయ్య, సభ్య కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ హెల్ప్‌డెస్క్‌ ద్వారా పారిశ్రామికవేత్తలకు తప్పనిసరి అనుమతులైన కన్సెంట్‌ టు ఎస్టాబ్లిస్‌మెంట్‌ టు ఆపరేట్‌(సీటీఈ), కన్సెంట్‌ టు ఆపరేట్‌ (సీటీఓ) పొందేందుకు ఆన్‌లైన్‌ కన్సెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌, ఇండస్ట్రిస్‌ సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఏఈఈ వంశీసత్యనారాయణ, డీపీఓ హరీష్‌ వీటిని నిర్వహిస్తారని తెలిపారు. పరిశ్రమల రిజిస్ట్రేషన్‌, పత్రాల సమర్పణ ఫీజు చెల్లింపు, అనుసరణ విధానాలపై హెల్ప్‌డె స్క్‌ను సంప్రదించాలని కోరారు.

అక్రమ రవాణాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ

ఇచ్ఛాపురం: అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టు నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూ డాలని ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ పట్టణ, గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లతో పాటు పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుని మంగళవారం అకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, రికార్డు భద్రపరిచే గదులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. పెండింగ్‌లో గల కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రౌడీ షీటర్లను నిరంతరంగా కౌన్సిలింగ్‌ చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అక్రమ రవాణా జరగకుండా బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సందర్శించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.

‘ఎరువులు తగిన మోతాదులో వాడాలి’

సారవకోట: రైతులు పంటలకు ఎరువులను తగిన మోతాదులో వాడాలని జిల్లా వనరుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ సీహెచ్‌ వెంకటరావు సూచించారు. మంగళవారం ధర్మలక్ష్మిపురం సచివాలయంలో ఆత్మా కార్యక్రమంలో భాగంగా రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు ఇష్టానుసారంగా ఎరువులు వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతుందని సేంద్రియ పద్ధతులను అవలంబించాలని, దాని వల్ల భూ సారం పెరుగుతుందన్నారు. వరితో పాటు చోడి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర పంటలను సైతం పండించాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు వేయడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఆయనతో పాటు స్థానిక ఏఓ కెసీహెచ్‌ వెంకటరావు, జిల్లా వనరులు కేంద్రం ఏఓ వై సురేష్‌, ఏఈఓ కంఠయ్య తదితరులు ఉన్నారు.

16న సీఎం పర్యటన

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన నరసన్నపేటలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఖరారైన నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. శాఖల వారీగా ఏయే అధికారికి ఏ విధులు కేటాయించిందీ వివరిస్తూ జిల్లా అధికారులు సమర్థంగా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొనగా కలెక్టరేట్‌ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, ఎస్డీసీలు పద్మావతి, లక్ష్మణరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ వేణుగోపాల్‌, ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ పి.సత్యనారాయణ, సీపీఓ లక్ష్మీప్రసన్న, ఏపీసీ వేణుగోపాలరావు, అదనపు డీఎంహెచ్‌ ఓ మేరీకేథరీన్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుధాకర్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ విజయ సారథి, డీఎస్‌ఓ సూర్య ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement