నరసన్నపేట: దేవాది వద్ద జాతీయ రహదారిపై అండర్ పాసేజ్ వంతెన పైనుంచి ఓ వ్యక్తి దూకేశాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని హైవే అంబులెన్స్‌లో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. నరసన్నపేట ఎస్సై బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంతెన పైనుంచి వ్యక్తి దూకడం సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.
లారీ ఢీకొని రిటైర్డ్ ఎంఈఓ మృతి
ఎచ్చెర్ల: అల్లినగరం జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో ఆకుల సన్యాసినాయుడు (80) మృతి చెందారు. ఈయన విశాఖపట్నం నుంచి స్వగ్రామం వచ్చేందుకు అల్లినగరం జంక్షన్ వద్ద బస్సు దిగి జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తలకు బలమైన గాయాలు తగలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సన్యాసినాయుడుకు భార్య సీతారత్నం, కుమారుడు నాయుడుబాబు, కుమార్తె ఉమ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు
రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ కిల్లి వెంకటరావు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పరిశీలించి వివరాలు సేకరించారు.


