శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని కోరుతూ పోరాటం సాగించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా కార్మికులను ప్రభుత్వం నిర్బంధించి అక్రమ కేసులు బనాయించడం తగదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఇఫ్టూ జిల్లా నాయకులు ఎస్.కృష్ణవేణి అన్నారు. నోయిడా కార్మికులపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని కోరుతూ నేషనల్ డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించాలని కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కార్మికులను మరింత దోపిడీ చేసేందుకు పెట్టుబడుదారులకు అవకాశం కల్పిస్తూ లేబర్ కోడ్స్ నిబంధనల్ని నోటిఫై చేసిందన్నారు.గతంలో కూడా బీహార్ ఎన్నికల అనంతరం 2025 నవంబర్ 21 లేబర్ కోడ్స్ అమలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తు చేశారు. లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు అల్లు సత్యనారాయణ, ఎం.గోవర్దనరావు, ఎన్.బలరాం, ఎం.రాఘవ, కె.అప్పలరాజు, ఎం.వి.రమణ, యం.నాగేశ్వరావు, డి.రాము, కేదారేశ్వరరావు, పి.జగ్గారావు, బి.జనార్దనరావు, కె.అప్పారావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


