రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ గణేష్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ కొలగాన శ్రీనివాసరావు ఇంట్లో పుస్తెలతాడు మాయమైంది. ఈ మేరకు అతని భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తన భర్త శ్రీను స్నేహితుడినని చెప్పి ఇంట్లో ప్రవేశించాడు. కూర్చోమని చెప్పి టీ తేవడానికి వెళ్లగా, ఆ వ్యక్తి టేబుల్‌పై ఉన్న పుస్తెలతాడు, సెల్‌ఫోన్ పట్టుకుని బయట గడియపెట్టి పరారైనట్లు బాధితురాలు పేర్కొన్నారు. జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, ఎస్సై ఎస్.చిరంజీవి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించి వివరాలు సేకరించారు.
చెరువులో మునిగి వ్యక్తి మృతి
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలంలోని స్కాట్‌పేట గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ (56)సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ ప్రతిరోజులాగే సోమవారం కూడా స్నానానికి చెరువుకు వెళ్లాడు. ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో భార్య సులోచన ఆందోళన చెంది గ్రామస్తులతో చెప్పగా.. వారు చెరువులో గాలించారు. మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. వెంకటరమణకు భార్యతో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. సులోచన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.


