● రోగుల పాలిట అపర సంజీవులు
● భరోసా కల్పించేలా సపర్యలు
● ఆస్పత్రుల్లో ఉన్నంత సేపూ సేవలు
● నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
నా తమ్ముడు చాలా కాలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని ఉన్నప్పటికీ ఇంట్లో మా తమ్ముడు పరిస్థితి వల్ల మెడికల్ డిపార్ట్‌మెంట్‌ను ఎంచుకున్నాను. నా ఆలోచనకు అమ్మ మద్దతు తెలపడంతో నర్సింగ్ పూర్తి చేశాను. బాధితులకు ధైర్యం చెబుతూ వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చేలా పనిచేయడం సంతృప్తినిస్తోంది. మా తమ్ముడ్ని దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెబుతున్నాను.
– ఎల్.సంధ్య, స్టాఫ్ నర్సు, ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం రూరల్:
అనారోగ్యం పాలైనప్పుడు రక్త సంబంధీకులే దరిచేరని రోజులివి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకు మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో కొందరు నర్సులు సకల సేవలందిస్తున్నారు. అమ్మ కన్నా మిన్నగా బాగోగులు చూసుకుంటున్నారు. ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు. నేడు నర్సింగ్‌డే సందర్భంగా కొందరు నర్సుల గురించి..
నర్సు వృత్తి దేవుడిచ్చిన వరంగా భావిస్తా. వృత్తిలో చేరి మూడేళ్లవుతోంది. చాలా మంది రోగులకు వైద్య సహాయక చర్యలు అందించాను. ఆరు నెలలు క్రితం నేను నైట్ డ్యూటీలో ఉండగా, అర్థరాత్రి సమయంలో అంంబులెన్స్‌లో ఓ యువకుడ్ని తెచ్చారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఘోరంగా కొట్టి రోడ్డు పక్కన పడేశారని చెప్పారు. ఎలాగైనా కర్తవ్యాన్ని నెరవేర్చాలన్న ఆలోచనతో సాధ్యమైనంత వరకు ప్రథమ చిక్సిత ద్వారా ఊపిరందించాను. అనంతరం మెరుగైన వైద్యం కోసం బరంపురం వెళ్లాల్సిందిగా సూచించాను. కోలుకున్న వారు కృతజ్ఞతతో చూసే చూపు మరిచిపోలేనిది.
– జె.మహేశ్వరి, స్టాఫ్ నర్సు, ఇచ్ఛాపురం
అమ్మా, నాన్నలు ప్రోత్సాహంతో నర్సింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని హెల్త్ డిపార్ట్‌మెంట్ వైపు వచ్చాను. 27 ఏళ్లగా ఇదే వృత్తిలో కొనసాగుతూ అనేక మంది పేషెంట్లకు చికిత్స అందించడం సంతృప్తిగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం కోటబొమ్మాళి ఆసుపత్రిలో పనిచేస్తుండగా ఓ మహిళకు పాము కాటేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు వెంటనే ఇంజక్షన్ చేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. ఆమె కోలుకోవడం, కుటుంబ సభ్యులు నన్ను అభినందించడం సంతృప్తినిచ్చింది. టెక్కలిలో ఉన్నప్పుడు ఓ మహిళా ఇంటి వద్ద ప్రసవం అయింది. ఆమె గర్భసంచి బయటకు రావడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తెచ్చారు. చాకచక్యంగా గర్భసంచిని యథాస్థానంలో ఉంచి కుట్లు వేశాను.
– ఆర్.భవానీ,హెడ్ నర్సు, ఇచ్ఛాపురం


