న్యూస్‌రీల్
శ్రీకాకుళం
సిగ్నల్ వస్తే ఒట్టుఏపీ ఫైబర్ నెట్ సిగ్నల్ రావడం లేదు. వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. –8లో
సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026
శ్రీకాకుళం క్రైమ్, పలాస :
జిల్లాలోని జంట పట్టణాలైన పలాస–కాశీబుగ్గలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. జిల్లాలోనే గొప్ప వర్తక కేంద్రంగా ఖ్యాతి పొందిన ఈ మున్సిపాలిటీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నా యి. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనంటూ ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వరుసగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలే అందుకు సాక్షి.
ఓ వైపు గన్ బెదిరింపులు, కిడ్నాప్‌లు, దాడు లు, దౌర్జన్యాలు, సోషల్ మీడియా అరెస్టులు స్థానికులను భయపెడుతున్నాయి. ఇవి జరుగుతుండగానే మరోవైపు దొంగనోట్ల ముఠా, అంతర్‌రాష్ట్ర దోపిడీ దొంగల చొరబాటు, జిల్లా చోరుల హస్తలాఘవం వంటివి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి చాలవు అన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం దుకాణాలు, బార్లు, బెల్టుషాపుల్లో ఏరులై పారిస్తున్న మద్యానికి తోడు ఏఓబీ ప్రాంత సరిహద్దుల్లో వెలుస్తున్న గంజాయి డెన్‌లు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. తాజాగా శనివారం మొబైల్‌షాపులో పనిచేస్తున్న ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు కత్తితో గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడటం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది.
పలాస–కాశీబుగ్గలో క్షీణించిన శాంతిభద్రతలు
వరుసగా దొంగతనాలు, దోపిడీలు
తాజాగా యువకునిపై హత్యాయత్నం
సమీప ఏఓబీ ప్రాంతాల్లోనే గంజాయి, పేకాట డెన్‌లు
ఇటీవల కాశీబుగ్గలోని ఓ బంగారం షాపులో ఒడిశా, యూపీలకు చెందిన డెకాయిట్ గ్యాంగులు పట్టపగలు చొరబడి యజమాని చేతు లకు బేడీలు వేసి గన్‌లతో బెదిరించి భారీగా బంగారాన్ని దోచుకుపోయారు. ఒడిశా డెకాయిట్లు పట్టుబడినా కథంతా నడిపింది కాశీబుగ్గలో ఉంటున్న ఒడిశా వలసదారుడే కావడం విశేషం.
ఊరుకునేది లేదు..
భారీ చోరీలనేవి తగ్గాయి. నేరస్తులను పట్టుకుంటున్నాం. అంతర్ రాష్ట్ర వలసదారులు ఇక్కడ స్థానికంగా ఉంటూ నేరాలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నాం. సర్వైలెన్సులు పెట్టాం. శాంతిభద్రతల పరిరక్షణలో మా పోలీసులు ముందుంటాం. – ఇటీవల మీడియాతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
ఘటనలు ఇవే..
ఆమదాలవలసకు చెందిన ఓ వ్యక్తి కాశీబుగ్గ జీడివ్యాపారిని(ఇతని సొంతూరు ఆమదాలవలసనే) ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో కిరాయి గూండాలతో కిడ్నాప్ చేయించాడు. అంతకుముందు ఏడాదే జీడి వ్యాపా రి కె.రాజేంద్ర కుమారున్ని ఆర్థికలావాదేవీల్లో తేడాతోనే కొందరు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు విచారణలో రుజువైంది. ఇదే కాశీబుగ్గలో ఓ ఆర్మీ ఉద్యోగి గణేష్ అఫ్‌సెంట్ ప్రింటర్స్ ఓనర్‌ని కిడ్నాప్ చేయించాడు.
పలాస రైల్వే స్టేషన్ టూవీలర్ పార్కింగ్, రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటెనెన్సు (ఆశీలు) కాంట్రాక్టు విషయంలో కాంట్రాక్టర్‌ను గన్‌తో ముగ్గురు బెదిరించారు.
ఈ ఏడాది జనవరిలో కాశీబుగ్గలోని చినతిరుపతిగా పేరొందిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఇదే జనవరిలో పూండిలో పంచాయతీ కార్యదర్శి ఇంట్లోనూ భారీ చోరీ జరిగింది. అంతకు ముందేడాది ఇదే పూండిలోని ఓ బంగారం షాపు లో భారీ చోరీ జరిగింది. పూండీ చోరీలు అంతర్‌రాష్ట్ర ముఠాల పనేనని ఇటీవల ఎస్పీ విలేకరుల సమావేశంలో సైతం చెప్పారు.


