● వేసవిలో ప్రణాళిక ఉండాల్సిందే
● ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం
● ఆహార నియమాలు పాటించి తీరాల్సిందే
ద్రవాహారమే ఉపయుక్తం
సాధారణ రోజుల్లో కంటే మూడు రెట్లు అధికంగా నీరు తాగాలి. పళ్ల రసాలు, మజ్జిగ, రాగి మాల్ట్, నిమ్మరసం వంటివన్నీ ఉపయుక్తమే. ఫ్రిజ్ నీటిని తాగకుండా కుండలు, కూజాలే ఉత్తమం. విపరీతమైన దాహం వేసే వరకు ఆగకుండా ఈ సీజన్‌లో తరచుగా నీరు, బార్లీ వంటి ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి.
శ్రీకాకుళం కల్చరల్:
కార్తెలు మొదలైనప్పటి నుంచి సూరీడు ఎక్క డా ఆగడం లేదు. నిప్పులు కక్కుతున్నాడు. కేవలం 4 రోజుల్లో అమాంతం పెరిగిన ఎండలు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ మే ఎండలను ఎదుర్కోవడానికి చక్కటి ప్రణాళికతో సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు.
చన్నీటి స్నానం మేలు
వేసవిలో చెమట పూర్తిగా ఆరాక మాత్రమే స్నానం చేయాలి. కనీసం రోజుకు 2 లేదా 3 సార్లు స్నానం చేస్తే మరీ మంచిది. నీళ్లలో రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ లాంటి మెడికేటెడ్ ఉత్పత్తులు కలపటం మేలు. ఉదయపు స్నానం ఒంట్లో బడలికను పోగొట్టి హుషారుగా చేసేందుకు సహకరిస్తే, రాత్రి వేళ స్నానం మలినాలను తొలగించి చక్కని నిద్రకు తోడ్పడుతుంది. ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే చన్నీళ్ల స్నానం బెటర్ అంటున్నారు ఫిజియోథెరపిస్టు కె.లక్ష్మణమూర్తి.
పాటిస్తే ఆరోగ్య యోగమే
వేసవిలో యోగా చాలా మంచిదని పతంజలి యోగా నిర్వాహకులు మావూరు నాగేశ్వరరావు అంటున్నారు. సూర్యనమస్కారం 12 భంగిమలు లెక్కిస్తూ చేయాలి. భంగిమకి 5 సెకండ్లు చొప్పున కేటాయిస్తూ ఓ నిమిషంలో పూర్తి చేయాలి. వేసవి కాలానికి తగ్గట్టుగా నిదానంగా చేసే ఈ సూర్యనమస్కారాలు రోజులో 6 సార్లు ఆచరిస్తే వేసవి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఉష్ణాసనం, ఏకమ్ముక్తాసనం, శశాంకాసనం, అర్దకోణాసనం, ప్రశాంతాసనం, యోగ నిద్ర, షణ్మఖి ముద్ర ఆసనాలు కూడా మంచివే. శీతలి, చంద్రభేధిని, నాడి శోధన చేయడం ద్వారా ఎండ వేడిమి వల్ల కలిగే శారీరక ఇబ్బందులు అధిగమించవచ్చు.
ఆహారమే కీలకం
వేసవిలో రుచికరమైన, ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్స్‌కి ఉంటాయి. బ్లాక్‌బె బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రాబెరీస్, రాస్ బెర్రీస్, బొప్పాయి, పచ్చి మామిడి, చెర్రీస్, యాపిల్, పుచ్చకాయ, ఉసిరి వంటివి విరివి గా ఉపయోగించడం మంచిది. కూరగాయల్లో కాకర కాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్, బ్రకోలి, దోస, గ్రీన్‌బీన్స్, పెద్ద వంకాయ, పుదీనా వంటివి నీటి పరిమాణాన్ని దేహంలో సమపాళ్లలో ఉంచేందుకు ఉపకరిస్తాయి. మాంసాహారం పరిమితం చేయాలి. ఓట్‌మిల్, బ్రౌన్‌రైస్, తియ్యటి బంగాళాదుంపలు ఆహారంలో భాగం చేస్తే బెటర్. ఆహారంలో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్‌ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కలిపి తీసుకుంటే దేహానికి అవసరమైన ఫాటీ యాసిడ్స్ అందుతాయి.


