చదువుకు దూరం | - | Sakshi
Sakshi News home page

చదువుకు దూరం

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

ఫీజుల భారం..

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

పేదలకు ఉన్నత చదువులు భారంగా మారుతున్నాయి. స్కాలర్‌ షిప్పులు, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్లపై ఆధారపడి చదువుతున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పెను భారమవుతోంది. దీని వల్ల కొందరి చదువులు అర్ధంతరంగా ఆగిపోతుంటే.. మరికొందరి సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాలు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పేదల ఉన్నత చదువులకు మొండిచేయి చూపుతోంది. ఈ ఏడాది విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల చెల్లింపులకు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ ప్రణాళిక ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకునేది. తల్లిదండ్రులపై భారం పడ కుండా పిల్లల చదువులు సాగిపోయేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ చదువుల్లో చేరిన వారికి ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఫీజ్‌ రీయింబర్సుమెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

2023–24 సంవత్సరం చివరిలో ఎన్నికలు రావడంతో చివరి రెండు విడతలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాలేదు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ బకాయి చెల్లించలేదు. కనీసం రెండు విడుతల్లో రూ.14.6 కోట్లు బకాయిలు ఉండిపోయాయి. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు.

2024–25 సంవత్సరంలో జిల్లాలో 52 వేల మంది విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో కొన్ని డిగ్రీలకు మాత్రమే ఒక విడత నగదు వేసి, చేతులు దులుపుకున్నారు. జిల్లాలో అత్యధికంగా ఉన్న సుమారుగా 44 వేల మంది బీసీలకు ఈ నగదు జమకాలేదు. ఒక విడతలో సుమారుగా రూ.12 కోట్లు విడుదల చేయాల్సింది, కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

2025–26 విద్యాసంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో సుమారుగా 52 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు వివిధ కోర్సులో ఉండగా.. వారిలో కేవలం 3321 మందికి మాత్రమే స్కాలర్‌ షిప్పులు విడుదల చేశారు. ఇది కేవలం రూ.4 కోట్లు. మిగిలిన విద్యార్థులు సుమారుగా 49 వేల మందికి రూ.48 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. వీరంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఇంటర్మీడియెట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ ప్రవేశాలు అయ్యాయి. గతంలో చేరిన విద్యార్థులు ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు వెళ్తున్నారు. వీరంతా ఫీజుల చెల్లింపుపై ఆందోళన చెందుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు

పెరుగుతున్న బకాయిలు

Advertisement
 
Advertisement
Advertisement