అంతులేని గ్యాస్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

అంతులేని గ్యాస్‌ కష్టాలు

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

సిలిండర్ల కోసం ముప్పు తిప్పలు పడుతున్న వినియోగదారులు

ప్రయాసలు పడుతున్న గ్రామీణ ప్రజలు

టెక్కలి: జిల్లాలో గ్యాస్‌ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా గ్యాస్‌ ఇబ్బందులు లేవంటూ అధికారులు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం సామాన్య వినియోగదారుడికి గ్యాస్‌ సిలిండర్‌ అందాలంటే పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తోడుగా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ కావాలంటే ఏకంగా 2 వేల నుంచి 2500 రూపాయలకు పైగా అవుతోందని అంటున్నారు. కమర్షియల్‌ సిలిండర్‌ ధర చెప్పాల్సిన పని లేదు. రెండు నెలల క్రితం వరకు రూ.1850 ఉన్న కమర్షియల్‌ గ్యాస్‌ ఇప్పుడు రూ.3270కు చేరింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన డొమెస్టిక్‌ వినియోగదారులు అనేక ప్రయాసలతో ఏజెన్సీల వద్దకు రెండు మూడు సార్లు తిరిగితే తప్ప సిలిండర్‌ దొర కడం లేదు. గ్యాస్‌ కొరత ఉందనే నెపంతో ఇప్పటి కే పట్టణాల్లో గ్యాస్‌ సిలిండర్ల సరఫరా వ్యవస్థ పెద్ద బ్లాక్‌ మార్కెట్‌గా మారుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే గ్యాస్‌ బుక్‌ చేసుకుని నిర్ణీత కాలంలో గ్యాస్‌ సిలిండర్‌ పొందాలని అధికారులు ప్రకటన లు చేయడం కేవలం కంటి తుడుపు చర్యగా మా రింది. ఏజెన్సీల ద్వారా అందని గ్యాస్‌ సిలిండర్లు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తే బయట మార్కెట్‌లో పుష్కలంగా లభ్యమవుతున్నాయని కొంత మంది వినియోగదారులు వాపోతున్నారు.

పర్యవేక్షిస్తున్నారా..?

ప్రతి రోజూ ఏజెన్సీల నుంచి ఎన్ని సిలిండర్లు సరఫరా చేస్తున్నారు, ఎక్కడకు చేరుతున్నాయి, అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారా, బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారా, ఈ వ్యవహారంలో డెలివరీ బాయ్స్‌ పాత్ర ఎంత మేరకు ఉంది అనేది ఎవరూ పర్యవేక్షించడం లేదన్న ఆరోపణ ఉంది. టెక్కలి, నందిగాం మండలాలకు ఒకే ఒక్క సివిల్‌ సప్లై డీటీ ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement