సిగ్నల్‌ వస్తే ఒట్టు! | - | Sakshi
Sakshi News home page

సిగ్నల్‌ వస్తే ఒట్టు!

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

ఏపీ ఫైబర్‌ నెట్‌.. సిగ్నల్‌ వస్తే ఒట్టు! ● సాంకేతిక లోపంతో సరిగ్గా అందని సేవలు ● మండిపడుతున్న వినియోగదారులు ● చేతులెత్తేస్తున్న ఆపరేటర్లు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం

ఏపీ ఫైబర్‌ నెట్‌..
● సాంకేతిక లోపంతో సరిగ్గా అందని సేవలు ● మండిపడుతున్న వినియోగదారులు ● చేతులెత్తేస్తున్న ఆపరేటర్లు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం

వజ్రపుకొత్తూరు రూరల్‌: జిల్లాలో ఏపీ ఫైబర్‌నెట్‌ సేవలను కూటమి పాలకులు గాలికి వదిలేశారు. ప్రజలు సాంకేతికతను అందిపుచ్చుకొని ఇంట్లోనే ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒకే ప్యాకేజీ కింద టీవీ, ల్యాండ్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ విత్‌ వైఫైతో సర్వీసులను ఏపీ ఫైబర్‌ లిమిటెడ్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో 40 వేలకు పైగా ఏపీ ఫైబ నెట్‌ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన ఈ సేవలను కూటమి ప్రభుత్వం తర్వాత పూర్తిగా గాలికి వదిలేయడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

నో సిగ్నల్‌..

ప్రభుత్వ బడులకు, గ్రామ, వార్డు సచివాయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఈ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. నిర్వహణ గాలికి వదిలేయడంతో సేవలు సరిగా అందని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 26 వేలకు కనెక్షన్లు తగ్గాయని అధికారులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రారంభంలో ఈ నెట్‌ బేసిక్‌ ప్లాన్‌ ప్రతి నెలా రూ.149 ఉండగా నేడు రూ.349కు పెరిగింది. ఈ ప్యాకేజీ డబ్బులను నెల ముందుగానే కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా వినియోగదారులు చెల్లించాలి. లేదంటే నెట్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయేవి. ముందుగానే బిల్లు చెల్లించినప్పటికీ ఇంటర్‌ నెట్‌లో నో సిగ్నల్‌ అంటూ చూపిస్తుండటంతో వినియోగదారులు మండిపడుతున్నారు. ఎప్పుడు నెట్‌ వస్తుందో ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. ఈ విషయమై కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్లు కూడా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. సాంకేతిక సమస్య ఉండటంతో పాటు యూపీఎస్‌లు పని చేయకపోవడం, డిజిటల్‌ బాక్స్‌లు ఇవ్వకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జియో, ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలు శాటిలైట్‌ వ్యవస్థ ద్వారా సిగ్నల్‌ను పంపిస్తుంటే ఏపీ ఫైబర్‌ నెట్‌ మాత్రం కేబుల్‌ వైర్ల ద్వారా అందిస్తున్నారు. ఏపీ ఫైబర్‌ సేవలలో సాంకేతిక లోపానికి వైర్లలో నాణ్యత కూడా ఒక కారణమని పలువురు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement