నేటికీ కొనుగోలు కాని ధాన్యం
మద్దతు ధర కోసం రైతుల నిరీక్షణ
సారవకోట: కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు వీడటం లేదు. సారవకోట మండలంలోని పలు గ్రామాలలో రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యం నేటికీ కొనుగోలు కాలేదు. సారవకోట, జగ్గయ్యపేట, బురుజువాడ, కొత్తూరు, అగదల తదితర గ్రామాల రైతులకు పంట త్వరగా చేతికి రావడంతో ధాన్యాన్ని వ్యాపారులకు ఎంతోకొంత ధరకు విక్రయించుకున్నారు. ప్రస్తుతం తొగిరి, అక్కివలస, బద్రి, అడ్డపనస గ్రామాల రైతులకు పంట ఆలస్యంగా చేతికి రావడంతో రోడ్లపై ఆరబెడుతున్నారు. ప్రభుత్వం రబీలో పండిన ధాన్యం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో వారంతా వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు సైతం సరైన ధర మార్కెట్లో లేదని, ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ఈదుర గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం భద్రపర్చుకునేందుకు అవకాశం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రోజులలో తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలవరపడుతున్నారు. మరోవైపు మొక్క జొన్న సాగు చేసిన రైతులు సైతం మద్దతు ధర లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


