జె.ఆర్‌.పురంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

జె.ఆర్‌.పురంలో చోరీ

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

ఐదు తులాల బంగారం, రూ.1.20 లక్షల నగదు మాయం

రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్‌.పురం పంచాయతీ వేంకటేశ్వర కాలనీ నడిబొడ్డున ఉన్న ఇంట్లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. రణస్థలం మండలం నారువ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్న డి.మల్లేష్‌ వెంకటేశ్వర కాలనీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లావేరు మండలం నేతేరు లక్ష్మీపురం వెళ్లారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని సమీపంలో ఉంటున్న బంధువులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే మల్లేష్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్‌ బృంద సభ్యులు వచ్చి వివరాలు సేకరించారు. ఐదు తులాల బంగారం, రూ.లక్షా ఇరవై వేలు నగదు పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలలో నమోదైన వివరాలు ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీతో రాత్రి 11 గంటల సమయంలో వచ్చారు. అందులో ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. 12.30 గంటల సమయంలో మిగతా ఇద్దరు స్కూటీతో రాగానే లోపలి వ్యక్తి బయటకు వచ్చి అందరూ పరారయ్యారు. జె.ఆర్‌.పురం ఎస్సై ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యంత రద్దీగా, ముఖ్య కూడలిలో ఉన్న ఇంట్లో చోరీ జరగడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడం ఎక్కువైందని, అర్ధరాత్రి వేళల్లో కూడా బైక్‌లతో తిరగడం, అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారిందని, ఇప్పటికై న ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement