శ్రీకాకుళం న్యూకాలనీ: బాక్సింగ్‌లో అంచెలంచెలుగా రాణిస్తూ.. ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది శ్రీకాకుళం యువ క్రీడాకారణి పెద్దింటి చైతన్య. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెరుపులు మెరిపిస్తోంది. యువ బాక్సర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
సిక్కోలు నుంచి ఐర్లాండ్ వరకు..
ఈ ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఐర్లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్పారింగ్ క్యాంప్, టెస్టు మ్యాచ్‌లల్లో చైతన్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తృటిలో పతకం కోల్పోయినా.. అంతర్జాతీయ వేదికపై సిక్కోలు వనితగా చూపించిన పోరాట ప్రతిభను బాక్సింగ్ దిగ్గజాలను సైతం మెచ్చుకునేలా చేసింది. తాజాగా అసోంలో గత నెల 13 నుంచి 20వ తేదీ వరకు జరిగిన 8వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన చైతన్య అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. పలువురు స్టార్ ప్లేయర్లను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన ఈ యువ కిషోరం చిన్న తప్పిదం కారణంగా ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది. దీంతో 65 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఎంతో కఠినమైన పోటీ నడుమ చైతన్య చూపించిన పోరాట ప్రతిభ అత్యద్భుమని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఫౌండర్, ప్రధాన కార్యదర్శి బలగ అనంత లక్ష్మణ్‌దేవ్(అను) పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో,.
ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే తన జీవిత లక్ష్యంగా సాధన చేస్తున్న చైతన్య శ్రీకాకుళం నగరంలోని పుణ్యపువీధిలో నివాసం ఉంటున్నారు. తండ్రి పెద్దింటి వేణుగోపాలరావు ఇండియన్ ఆర్మీలో సుబేదార్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తుండగా, తల్లి తేజేశ్వరి గృహిణి. చైతన్య విశాఖపట్నంలోని వాల్తేర్ కేంద్రీయ విద్యాలయంలో 10+2 (ఇంటర్) చదువుతూ.. విశాఖలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో సాధన చేస్తోంది.
ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే నా జీవిత లక్ష్యం. కోచ్‌ల పర్యవేక్షణలో నిరంతర సాధన చేస్తున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, బాక్సింగ్ సంఘ పెద్దలు, కోచ్‌ల నిరంతర కృషితో రాణించగలుగుతున్నాను. భవిష్యత్తులో మరిన్ని పెద్ద టోర్నీల్లో పతకాలు సాధిస్తాననే నమ్మకముంది.
– పెద్దింటి చైతన్య,
బాక్సింగ్ క్రీడాకారిణి
బాక్సింగ్‌లో సత్తాచాటుతున్న పెద్దింటి చైతన్య
ఐర్లాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్పారింగ్ క్యాంప్, టెస్టు మ్యాచ్‌ల్లో రాణింపు
తాజాగా యూత్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకంతో మెరుపులు


