కక్ష గట్టి.. గొంతు కోసి.. | - | Sakshi
Sakshi News home page

కక్ష గట్టి.. గొంతు కోసి..

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

మొబైల్‌ షాపులో పనిచేస్తున్న వ్యక్తిపై ఇద్దరు వ్యక్తుల దాడి

షాపు నుంచి బయటకు తీసుకొచ్చి గొంతు కోసి పరారీ

పలాస : కాశీబుగ్గ కె.టి.రోడ్డులోని ఓ మొబైల్‌ షాపులో పనిచేస్తున్న లోలుగు ఈశ్వరరావు(20) అనే యువకుడిపై పలాస రాజమ్మకాలనీకి చెందిన రాజాం తిరుపతి, అతని స్నేహితుడు కోత సురేష్‌ దాడికి పాల్పడ్డారు. శనివారం షాపులోకి వెళ్లి మాట్లాడదామని చెప్పి బయట రోడ్డు మీదకు తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే ఈశ్వరరావు గొంతును చాకుతో కోసేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఈశ్వరరావును పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుట్లు వేశారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

ప్రేమ వ్యవహారమే కారణమా..

పోలీసుల కథనం ప్రకారం.. ఈశ్వరరావు అన్నయ్య రమేష్‌.. తిరుపతి చెల్లెలను ఏడాది క్రితం ప్రేమించాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇదే సమయంలో ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి రమేష్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె తండ్రి మనస్థాపానికి గురై మృతి చెందాడు. దీంతో అమ్మాయి కుటుంబీకులు రమేష్‌, అతని కుటుంబ సభ్యులపై కక్ష పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రమేష్‌ తమ్ముడు ఈశ్వరరావుపై దాడికి పాల్పడినట్లు సమాచారం. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement